Begin typing your search above and press return to search.

పవన్ ట్వీట్లతో మోడీకి పంచ్?

By:  Tupaki Desk   |   21 Jan 2017 5:24 AM GMT
పవన్ ట్వీట్లతో మోడీకి పంచ్?
X
ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మిగిలిన వారికి భిన్నంగా ఆయన చేస్తున్న ట్వీట్లు ఉంటున్నాయి. సామాజిక అంశాల మీద వ్యూహాత్మకంగా ఆయన చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు చర్చగా మారటమేకాదు.. ప్రభుత్వాల్ని ఉరుకులు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. ఆ మధ్యన ఉద్దానం ఇష్యూ మీద కానీ.. తాజాగా పోలవరం అంశం మీద కాని పవన్ ట్వీట్లు చేసిన వెంటనే రియాక్షన్స్ వచ్చేస్తున్నాయి.

తమిళనాడులో తాజాగా జల్లికట్టు బ్యాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో మిగిలిన హీరోలతో పాటు పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. కానీ.. మిగిలిన వారు ఎవరూ ప్రస్తావించని రీతిలో జల్లికట్టుతో పాటు.. ఏపీలోని కోడిపందేలా బ్యాన్ మీద కూడా మాట్లాడారు. సంక్రాంతి సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కోడి పందాల గురించి పవన్ మాట్లాడటం చాలామందికి అర్థం కాలేదు.

సంక్రాంతి సమయంలో కోడి పందేల మీద హాట్ హాట్ గా చర్చ జరిగినప్పుడు రియాక్ట్ కాని పవన్.. కాస్త ఆలస్యంగా.. పండగ అయిపోయిన తర్వాత కోడి పందాల ప్రస్తావన తీసుకురావటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఇదంతా టైం చూసుకొని కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా చెప్పాలి. పవన్ ట్వీట్లు మిగిలిన వారి ట్వీట్లకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపించక మానదు.

ఏదైనా విషయం మీద తమకున్న అభిప్రాయాల్ని వెల్లడించే ప్రముఖులకు భిన్నంగా పవన్ ట్వీట్లు ఉంటాయి. తాను ఏదైనా అంశం మీద ట్వీట్స్ చేయటానికి రీసెర్చ్ తో పాటు.. పలువురు నిపుణులు.. మేధావుల సలహా.. సంప్రదింపుల తర్వాత తానేం ఫీలవుతున్నానన్న విషయాన్ని చెబుతున్నట్లుగా కనిపించక మానదు. జల్లికట్టుపై తమిళుల ఆందోళనల నేపథ్యంలో రియాక్ట్ అయిన పవన్.. కోళ్ల పందాల అంశాన్ని తెలివిగా ప్రస్తావించారు.

కోళ్ల పందాల్ని హింసగా చూసే వారి కళ్లు తెరిచేలా.. బీఫ్ ఎక్స్ పోర్ట్.. పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించిన గణాంకాల్ని ప్రస్తావిస్తూ ‘ప్రభుత్వ విధానాల్ని’ కడిగిపారేశారని చెప్పాలి. సంస్కృతి సంప్రదాయాల్ని మాత్రమే ప్రస్తావించకుండా.. ప్రాంతాల వారీ ప్రజల మనోభావాల్ని గౌరవించకుంటే.. జాతీయసమైక్యతకు ఎంత భంగం వాటిల్లుతుందన్న విషయాన్ని చెప్పిన తీరు పలువురికి షాకింగ్ గా అనిపించాయి.

ఓపక్క ప్రజల మనోభావాలు.. మరోవైపు కరుకైన వాస్తవాలు.. నిబంధనలు.. హింసను అడ్డుకుంటామంటూ చెప్పే పాలసీల్లో డొల్లతనాన్ని బయటకు చెప్పేలా.. కొన్ని లెక్కల్ని చెప్పుకొచ్చారు. ఏడాదికి ఒక్కసారి ఆడే జల్లికట్టుతోనూ.. కోళ్ల పందాలతో బోలెడంత జంతుహింస జరుగుతుందని గుండెలు బాదుకునే సున్నిత మనస్కులు..ప్రతి ఏటా మిలియన్ల కొద్దీ కోళ్లను చంపటం ద్వారా 8.4 లక్షల టన్నుల (టన్నుఅంటే వెయ్యి కిలోలు. ఈ అంకెను క్యాలికులేటర్ తో లెక్కేసి.. దాన్ని ఎన్ని కోళ్లు అన్న లేక్క వేయండి. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది) చికెన్ ను ఉత్పత్తి చేస్తున్న వైనం.. స్లాటర్ హౌస్ ల ద్వారా 24 లక్షల టన్నుల బీఫ్ ని ఎగుమతి చేస్తున్న వైనాన్ని బయటకు వెల్లడిస్తూ.. ఇదంతా జంతు హింస కాదా? అని ప్రశ్నించారు.

వీటన్నింటితో పాటు.. పురాణాల్లో కుక్కుటేశ్వరుడి ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. తాను ప్రస్తావించే అంశాల్ని లోతుగా అధ్యయనం చేశాకే మాట్లాడతాను తప్పించి.. మరోలా కాదన్న మాటను పవన్ తన ట్వీట్లతో చెప్పేశారు. ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా.. పాలకులు చేసే అరకొర చట్టాలతో కొత్త సమస్యలు పుట్టుకురావటం.. వీటితో న్యాయవ్యవస్థకు ఇబ్బంది కలిగేలా చేయటం కనిపిస్తుంది. జల్లికట్టుతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయ్యే వేళ.. తన ట్వీట్లతో మరింత వేడిని పవన్ పుట్టించారని చెప్పాలి. పవన్ సంధించిన ట్వీట్ అస్త్రాలు ఇప్పటికిప్పుడే మోడీకి ఇబ్బందిగా మారతాయని చెప్పలేం కానీ.. ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచేందుకు మాత్రం సాయం చేస్తాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/