Begin typing your search above and press return to search.

బాబు గజ సర్కారుకు పవన్ అంకుశం

By:  Tupaki Desk   |   29 Aug 2015 4:14 AM GMT
బాబు గజ సర్కారుకు పవన్ అంకుశం
X
తాను ఏమనుకుంటే అది మాత్రమే చేసే ఏపీ ముఖ్యమంత్రికి కళ్లాలు వేసే అవకాశం ఉందా? ఆయన్నుకేవలం మాటల్లో నియత్రించే శక్తి ఎవరికైనా ఉందా? అన్న ప్రశ్నలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న సమాదానం లభిస్తోంది. గతంలో తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రి.. తాజాగా పది హేను నెలలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబును ప్రభావితం చేసిన వారు ఇప్పటివరకూ ఎవరూ లేరు.

ఆయన వరకు ఆయన ఏదైనా అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకూ అమలు చేయకుండా వదలరు. అంత పట్టుదలతో ఉండే చంద్రబాబు.. తన వైఖరికి భిన్నంగా పవన్ కల్యాణ్ మాటలకు ప్రాధాన్యత ఇవ్వటమే కాదు.. తన అధికారిక నిర్ణయాన్ని పక్కన పడేసేందుకు సిద్ధం కావటం గమనార్హం.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూముల్లో రైతులకు ఇష్టం లేకున్నా.. భూసేకరణ ద్వారా తీసుకోవాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. భూసేకరణ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విమర్శలు చెలరేగాయి. కొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా.. ఎలాంటి ఫలితం లేకుండా. చివరకు విపక్ష నేత సైతం.. రాజధాని భూసేకరణ విషయం మీద నిప్పులు చెరిగినా.. చీమ కుట్టినట్లుగా లేని బాబు సర్కారు.. పవన్ విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించటంతో పాటు.. అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవటానికి తాను సిద్ధం లేనన్న విషయాన్ని స్పష్టం చేసింది.

భూసేకరణపై తన ట్వీట్లతో మనోగతాన్ని పవన్ ఆవిస్కరిస్తే.. కొందరు మంత్రులు ఎటకారం చేయటం.. రివర్స్ గేర్ లో విమర్శలు చేయటం తెలిసిందే. దీనిపై పవన్ అగ్రహం చేయటంతో పాటు.. రాజధాని నిర్మించాలనుకుంటున్న ప్రాంత రైతులతో సమావేశమై.. ‘‘లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. నేను చెబుతున్నా’’ అంటూ బుల్లెట్ లాంటి మాటల తీవ్రతను బాబు గుర్తించటంతో పాటు.. భూసేకరణను నిలిపివేయాలని నిర్ణయం చూస్తే.. పవన్ మాటకు బాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. మొత్తగా చూస్తే.. మదగజం లాంటి చంద్రబాబు సర్కారును.. తన మాటల అంకుశంతో దారికి తెస్తానన్న విషయాన్ని పవన్ కల్యాణ్ చేతల్లో నిరూపించారు. అంటే.. రానున్న రోజుల్లో బాబు సర్కారు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల్లో పవన్ అనుమతి తప్పదన్న విషయం తాజా ఉదంతంతో చెప్పకనే చెప్పినట్లు అయ్యిందని చెప్పాలి.