Begin typing your search above and press return to search.

పవన్ కు కావాల్సింది ఇదేనా ?

By:  Tupaki Desk   |   28 Sep 2021 5:30 AM GMT
పవన్ కు కావాల్సింది ఇదేనా ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహంలో సక్సెస్ అయినట్లే అనిపిస్తోంది. వైసీపీ వాళ్ళని నాలుగు మాటలని తిరిగి పది మాటలు అనిపించుకోవటంలోనే పవన్ సక్సెస్ ఉంది. ప్రభుత్వంపై ఆరోపణలు చేయటంతో పాటు జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్నినాని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తిరిగి తనపై పదిమంది ఎటాక్ చేస్తారని, ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతారని తెలీనంత అమాయకుడు కాదు పవన్. అన్నీ తెలిసే పవన్ కావాలనే ప్రభుత్వాన్ని, జగన్+మంత్రిని కెలికారు.

దీనికి నేపథ్యం కూడా ఒకటుంది. అదేమిటంటే పార్టీ అధినేతగా, రాజకీయనేతగా పవన్ అంత సక్సెస్ కాలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్ ల గ్యాప్ లో పార్టీ నేతలతో సమావేశం పెట్టడం లేదా మీడియాతో మాట్లాడటం పవన్ అలవాటు. ఈ నేపధ్యంలోనే నోటికొచ్చినట్లు మాట్లాడేసి మళ్ళీ షూటింగులకు వెళిపోతుంటారు. పవన్ మాట్లాడిన దానిపై ప్రత్యర్ధులు ఓ రెండు రోజుల పాటు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి పవన్ ని నానా మాటలంటారు.

ఇదే పద్దతిని ఇపుడు కూడా కావాలనే ఫాలో అయ్యారు. సినిమా ఫంక్షన్లో కావాలనే పవన్ రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వాన్ని, జగన్+నానీని నానా మాటలనేసి మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయారు. దాని ఫలితంగా మరుసటి రోజునుండి మంత్రులు పవన్ పై విరుచుకుపడుతునే ఉన్నారు. పవన్ కు కావాల్సింది కూడా ఇదే. పేర్నినానీపై ఆరోపణలు చేశారు కాబట్టి డెఫనెట్ గా నానీ విరుచుకుపడతారని అందరికీ తెలిసిందే. కానీ సహచర మంత్రులు వెల్లంపల్లి, అనీల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా మాట్లాడారు.

మంత్రులు మాట్లాడటమే కాకుండా మరుసటి రోజు పోసాని కృష్ణమురళి, ఎంఎల్ఏ మల్లాది విష్ణు లాంటి వాళ్ళు కూడా పవన్ పై విరుచుకుపడ్డారు. ఈ ఎపిసోడ్ కు ముందు కేవలం టీవీల్లో వచ్చే సినిమా అడ్వర్టైజ్ మెంట్లు మాత్రమే పవన్ కు ప్రచారం. కానీ ఇపుడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రం మొత్తం ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. ఏ న్యూస్ చానల్ పెట్టినా పవన్ గోలే. వైసీపీ పెద్దలు కాస్త ఓపికగా ఆలోచించి ఉంటే పవన్ను ఇంతలా టార్గెట్ చేసుండేవారు కాదు.

టార్గెట్ అయ్యింది మంత్రి పేర్నినాని కాబట్టి ఆయనతో మీడియా సమావేశం పెట్టి వదిలేసుంటే సరిపోయేది. కానీ అలాకాకుండా ఎవరికి వాళ్ళుగా రెచ్చిపోవటంతోనే పవన్ వ్యూహంలో అధికార పార్టీ పడిపోయిందా అనే అనుమానం పెరిగిపోతోంది. నోటికొచ్చినట్లు మాట్లాడటం, జగన్ పై బురదచల్లటం పవన్ కు కొత్తేమీకాదు. గతంలో కూడా ఇదే పద్దతిలో చాలాసార్లు చేశారు.

కాబట్టి అధికార పార్టీ నేతలు చేయాల్సిందేమిటంటే ఇకనుండి పవన్ మాటలకు రియాక్టవ్వటం మానేయాలి. లేకపోతే తామే పవన్ కు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుందన్న విషయాన్ని గ్రహించాలి. మంత్రులు, పోసాని, ఎంఎల్ఏల రియాక్షన్ పై పవన్ మళ్ళీ తన ట్విట్టర్లో స్పందించారు. మళ్ళీ దీనిపై వైసీపీ నేతలు గోల చేస్తారు. అసలిదంతా అవసరమా ? అని అధికారపార్టీ నేతలు తమను తాము ప్రశ్నించుకోవాలి. పవన్ విషయంలో ఈస్ధాయి స్పందనలు అవసరమే లేదు. ఎందుకంటే జనాలే పట్టించుకోకుండా వదిలేసిన పవన్ గురించి మంత్రులు అధికార పార్టీ నేతలు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి ?