Begin typing your search above and press return to search.

ఆ స్టిక్కర్ కిందనే.. పవన్ స్టిక్కర్.. కొత్త రచ్చ మొదలైంది

By:  Tupaki Desk   |   9 April 2023 11:16 AM GMT
ఆ స్టిక్కర్ కిందనే.. పవన్ స్టిక్కర్.. కొత్త రచ్చ మొదలైంది
X
నాలుగేళ్ల తమ పాలనను ప్రజలకు తెలిపేందుకు వీలుగా సరికొత్త ప్రచారాన్ని షురూ చేసిన జగన్ సర్కారుకు ఇప్పుడు కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సరికొత్త ప్రచారాన్ని చేపట్టటమే కాదు.. ప్రజల అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకు ప్రజా సర్వేను నిర్వహిస్తోంది ఏపీలోని జగన్ సర్కారు.

ఇందులో భాగంగా భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం.. ప్రతి ఇంటికి వెళ్లి.. వారి వివరాలు నమోదు చేసుకోవటం.. సెల్ ఫోన్ లో మిస్డ్ కాల్ ఇప్పించటం లాంటివి చేస్తున్నారు. అనంతరం ఇంటికి.. వారు వాడే సెల్ ఫోన్ వెనుకపక్క జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్లను అంటిస్తున్నారు.

అందులో ‘‘మా నమ్మకం నువ్వే జగనన్నా’’ అన్న నినాదంతో పాటు జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికిస్తున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జనసైనికులు. ప్రభుత్వం అతికిస్తున్న స్టిక్కర్లకు కౌంటర్ గా.. వారి స్టిక్కర్లకుకిందనో.. పక్కనే అంతకు మించిన పెద్ద సైజుతో ఉన్న ‘‘మాకు నమ్మకం లేదు జగన్. మా నమ్మకం పవన్’’ అంటూ ప్రముఖంగా రాసిన నినాదం ఉన్న స్టిక్కర్లను అతికిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తిరుపతి జనసైనికులు వినూత్నంగా చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం మిగిలిన జిల్లాల్లోని జనసైనికులకు కొత్త స్ఫూర్తిని రగిలించేలా చేసిందంటున్నారు. వైసీపీ నేతలు.. ప్రజా సర్వే చేస్తున్న సిబ్బంది అతికించే స్టిక్కర్ల పక్కనే జనసైనికులు అతికిస్తున్న ఈ కొత్త స్టిక్కర్ తో కొత్త రచ్చ ఖాయమన్న మాట వినిపిస్తోంది.

అయితే.. తాము అతికించిన స్టిక్కర్లపై పోలీసులు తమను బెదిరిస్తున్నారంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కౌంటర్ స్టిక్కర్ల రచ్చ పెరిగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోవటం ఖయమంటున్నారు.