Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు క‌మాండో వాహ‌నాలు రెడీ

By:  Tupaki Desk   |   12 Jun 2022 2:28 PM GMT
ప‌వ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు క‌మాండో వాహ‌నాలు రెడీ
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయదశమి నుంచి ఏపీలోని జిల్లాల్లో పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన వాహన శ్రేణిని సిద్ధం చేశారు. ఎనిమిది కొత్త స్కార్పియో క‌మాండో వాహనాలను పవన్ పర్యటన కోసం కొనుగోలు చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయానికి ఆ వాహ‌నాలు చేరుకున్నాయి. ఎనిమిది నలుపు రంగు స్కార్పియో వాహనాలను పవన్ పర్యటన కోసం సిద్ధం చేశారు. పవన్ పర్యటనకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వీటికి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అక్టోబరు 5 విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ఇప్ప‌టికే ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటించటంతో పాటు, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగసభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నారు.

వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, ఇప్పటినుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్‌ అభిప్రాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ఎస్సీ ఎస్టీల‌పై దాడులు వంటి కీల‌క‌మైన అంశాల‌పై.. ప‌వ‌న్ ప్ర‌చారం చేయ‌నున్నారు. అదేవిధంగా సీపీఎస్ ర‌ద్దు, మ‌ద్య నిషేధం, పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా అంశాల‌పైనా.. జ‌గ‌న్ మాట త‌ప్పిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. సుమారు ఈ ప‌ర్య‌ట‌న‌లు ఆరు నెల‌ల‌ నుంచి ఏడాదిపాటు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు మాజీ మంత్రి లోకేష్‌లు ప‌ర్య‌ట‌న ప్రారంబించ‌నున్నారు. అంటే.. టీడీపీ ఒక‌వైపు.. జ‌న‌సేన మ‌రోవైపు.. టీడీపీ ప్రారంభించ‌నున్న ఈ యాత్ర‌లు రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించ‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వైసీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.