Begin typing your search above and press return to search.

చేనేత గర్జనలో పవన్ చెప్పిందేమిటి..?

By:  Tupaki Desk   |   20 Feb 2017 5:56 PM GMT
చేనేత గర్జనలో పవన్ చెప్పిందేమిటి..?
X
ఒక దాని తర్వాత మరొకటి అన్నట్లుగా.. ఒక్కోసమస్యను స్పృశిస్తూ.. వాటికి పరిష్కార మార్గాల్ని ఏపీ అధికారపక్షానికి సూచిస్తున్నారు జనసేన అదినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఏపీలో నెలకొన్ని వివిద సమస్యలపై క్రమపద్ధతిలో.. వ్యూహాత్మకంగా గళం విప్పుతున్న ఆయన.. తాజాగా గుంటూరుకు సమీపంలోని చినకాకానిలో ఏర్పాటు చేసిన చేనేత గర్జన లో ప్రసంగించారు. రాజకీయాల్లోకి పార్ట్ టైం కాదని ఫుల్ టైం వర్క్ చేసేందుకు తాను సిద్ధమవుతున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్.. తొలుత తిరుపతి సభతో శ్రీకారం చుట్టటం తెలిసిందే.

తిరుపతి అనంతరం రాజమండ్రిలో సభ నిర్వహించిన ఆయన.. తర్వాత అనంతపురం వెళ్లారు. అక్కడ సమస్యలపై గళం విప్పిన ఆయన.. తర్వాత శ్రీకాకుశం వెళ్లి ఉద్దానం సమస్యను తెర మీదకుతీసుకొచ్చారు.తాజాగా.. చేనేత కార్మికుల వెతల్ని.. వారి కష్టాల్ని ప్రభుత్వం తీర్చాలన్నగళాన్ని విప్పుతూ.. చేనేత గర్జన పేరిట కార్యక్రమాన్నినిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తిరుపతి సభలో ప్రత్యేకహోదా మీద గళాన్ని విప్పిన ఆయన.. రాజమండ్రి సభ వరకూ హోదా మీదనే ఫోకస్ చేశారు. తర్వాత మాత్రం అందుకు భిన్నంగా.. వివిధ సమస్యల మీద తన గళాన్ని విప్పటం గమనార్హం.

మిగిలిన సభలతో పోలిస్తే.. చేనేత గర్జన సందర్భంగా ఆయన కాస్తంత భిన్నంగా వ్యవహరించారనే చెప్పాలి. చేనేత సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసాన్ని ఇచ్చిన పవన్ కల్యాణ్. . ఈ సందర్భంగా తాను ఎప్పుడూ ధరించే ఎర్ర కండువాను మెడలో వేసుకున్నారు. తాను వేసుకునే ఎర్ర కండువా గురించి సభ మధ్యలో ప్రస్తావిస్తూ.. ఎర్ర కండువ సామాన్యుడి శక్తి అని.. దానికి కులం.. మతం లేదన్న పవన్.. తాను గబ్బర్ సింగ్ ను కాదని.. తానో సామాన్యుడినంటూ ఎర్ర కండువాను పట్టుకొని చెప్పటం గమనార్హం.

పవన్ ప్రసంగంలోని అంశాల్ని చూస్తే..

= రైతులు.. చేనేతలు కన్నీళ్లు కారిస్తే దేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉండదు. చేనేత కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. పీడిత ప్రజల పక్షాన పోరాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాక. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వస్తా. వాటిని వెలుగులోకి తీసుకొస్తా. గతంలో చెప్పినట్లే 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా. అసెంబ్లీలో చేనేత కళాకారుల వాణిని వినిపిస్తా.

= నేను కోరుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగలను. కానీ.. అలా చేస్తే చేనేత కళాకారుల కష్టాలు తీరవు. కోట్ల సంపాదన మీద ఆశ లేదు. చిన్నప్పటి నుంచి చేనేత కళాకారుల కష్టాలు బాగా తెలుసు.

= చేనేతన్నలను కార్మికులంటే ఊరుకోను. వారిని చేనేత కళాకారులంటే ఒప్పుకుంటా. చిన్నతంలో మేం చీరాలలో ఉండేవాళ్లం. అప్పట్లో మా ఇంటి పక్కనే చేనేత కుటుంబాలు ఉండేవి. వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో.. వారు పస్తులతో ఎలా ఉంటారో.. స్కూల్ ఫీజులు కట్టటానికి పడే ఇబ్బందులు.. క్యారేజీల్లో అటుకుల్లాంటివి మాత్రమే తెచ్చుకోవటం లాంటివన్నీ నాకు గుర్తుండే ఉన్నాయి.

= చేనేత ఆధారిత పరిశ్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానంటే వడ్డించే వాళ్లను వదిలేసి.. విస్తరాకులు ఎత్తుకునే వాళ్ల దగ్గరకు వెళ్లటం ఏమిటని కొంతమంది నన్ను కించపరిచారు. కానీ.. అసలు చెత్తను శభ్రపరిచే వాళ్లే లేకపోతే.. ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి. వాడుకకు బాగుంటాయని ఎలా పడితే అలా సామెతల్ని వాడితే కులాలను కించపర్చినట్లు అవుతుంది.

= సినీపరిశ్రమకు పైరసీ మాదిరే.. చేనేతల్ని దోచుకుంటున్నపారిశ్రామికవేత్తలను ఎందుకు ఆపలేకపోతున్నారు. వీళ్లకు రావాల్సిన ఆదాయాన్ని పవర్ లూమ్స్ ద్వారా గండి కొడుతున్న వాళ్లను నియంత్రించాలి. లేకుంటే.. ఈ రోజు సత్యాగ్రహం చేస్తున్న వారు రేపొద్దున రోడ్ల మీదకు రాకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. చేతుల్లో కళ ఉండి.. పస్తులు ఉండాల్సి రావటం దయనీయం. పదిమందికి జీవనోపాధి కల్పించే నైపుణ్యం ఉన్న వాళ్లు చివుకు కూలీలుగా మిగిలిపోతున్నారు.

= తెలుగుదేశం సర్కారు.. తెలంగాణ ప్రభుత్వాలు చేనేతకు అండగా నిలబడతామని చాలానే చెప్పారు. కానీ.. ఇల్లు అలకగానే పండగ కాదు. ప్రభుత్వాలు చెప్పినా.. వాళ్లు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూసేందుకు ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. 11 రకాల ఉత్పత్తులు చేతి మగ్గాలపైనే తయారు చేయాలి. పవర్ లూమ్స్ పేరిట కార్మికుల పొట్ట కొడుతున్న వారిని శిక్షించాలి.

= చేనేత కార్మికుల కూడా క్రీడాకారులకు ఇస్తున్నట్లే నగదు ప్రోత్సాహకాల్ని ఇవ్వాలి. ప్రపంచంలోని తెలుగు వారంతా వారంలో ఒక్కసారి అయినా చేనేత కట్టాలి. మన పంచె.. మన కట్టు మర్చిపోకూడదు. నన్ను అభిమానించే వారంతా వారంలో ఒక రోజు చేనేత ధరించాలి. అన్నం పెట్టే రైతులు.. బట్టలు నేసే నేతన్న కన్నీళ్లు పెడితే సుభిక్షంగా ఉండదు.

= ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసగిస్తున్నాయి. ఓట్లకు వచ్చినప్పుడు సరళమైన భాషలో.. అందరికి అర్థమయ్యేలా మాట్లాడతారని.. కానీ.. పదవులు వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు ఆ మాట మీద నిలబడలేకపోతున్నారు? హోదా ఇవ్వకపోతే.. ఎందుకు ఇవ్వలేకపోతున్నారో.. దానిసాధ్యాసాధ్యాలుఏమిటో వివరించాలి. అలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది.

= ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని.. దానికి చట్టబద్ధత కల్పిస్తామని ఒకసారి చెప్పారని.. అది అవసరం లేదని అంటున్నారు. ఇలా అదేపనిగా ఎందుకు మాట మారుస్తున్నారు? 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. సమస్యల మీద ఎదురు నిలబడి పోరాటం చేసే నాయకుల కోసం చూస్తున్నా. యువ నాయకులు.. పోరాట పటిమ ఉన్నవాళ్లు.. నిస్వార్థ పరుల కోసం ఎదురు చూస్తున్నా. ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్లే నాయకులు.

= వారసత్వ నాయకత్వం మీద వ్యతిరేక భావన లేదు. ఒక్కరు ఓటువేసినా.. కోటిమంది ఓటు వేసినా.. ప్రజల తరఫునే నిలబడతా. ప్రజా ధనాన్నిసంరక్షేం వారే నాయకులు.. దోపిడీ.. దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకుల్ని ప్రజలు శిక్షించాలి.​