Begin typing your search above and press return to search.

రాష్ట్ర విభజన నాలో మార్పు తెచ్చింది: ఢిల్లీలో పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   21 Feb 2020 3:49 AM GMT
రాష్ట్ర విభజన నాలో మార్పు తెచ్చింది: ఢిల్లీలో పవన్ కళ్యాణ్
X
తాను దేశం కోసం ఎంతో ఓపికతో ముందుకు సాగుతున్నానని - రేపటి తరం కోసమే తన పోరాటమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి సేవ చేయాలన్న తపనతో తాను పార్టీని స్థాపించానని చెప్పారు. సుదీర్ఘ అధ్యయనం తర్వాత జనసేనను స్థాపించానని, రెండు చోట్ల పోటీ చేసిన తాను ఓడిపోయానని - పార్టీకి ఘోర పరాజయం కలిగిందని - కానీ ఆ పరాజయం తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేకపోయిందన్నారు.

తనకు ఇగో లేదని - ఎక్కడి నుండి ప్రారంభమయ్యానో - లక్ష్యం ఏమిటో తనకు తెలుసునని చెప్పారు. తన కొడుకుకు ఇప్పుడు 14 ఏళ్లు ఉన్నాయని - తాను పోరాటం చేస్తోంది అలాంటి భవిష్యత్తు తరాల కోసమే అన్నారు. దేశం మీద ప్రేమ - పేదల కోసం పని చేయాలనే తనప ఉంటే వారిని ఓటములు అడ్డుకోలేవని చెప్పారు. భగత్ సింగ్ లాంటి వారు తనకు ఆదర్శమని - జాతీయ - ప్రాంతీయ రాజకీయాలను చూస్తూ పెరిగానని - అధికారం కోసం చేస్తోన్న రాజకీయాలు విసుగు కలిగించాయన్నారు.

కర్నూలులో సుగాలి ప్రీతి విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని భారీ ర్యాలీ నిర్వహించామని - దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేసును సీబీఐకి అప్పగించిందని గుర్తు చేశారు. సినిమాల్లో రెండు మూడు నిమిషాల్లో ఏదైనా సాధ్యమని - కానీ నిజ జీవితంలో సమయం తీసుకుంటుందన్నారు. ఓటములు ఎదురైనా లక్ష్యం కోసమే జరిపే పోరాటాన్ని ఆపవద్దని - అందుకే తాను సోషల్ మీడియాకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వచ్చి పని చేయాలని విద్యార్థులకు సూచిస్తున్నానని చెప్పారు.

తన జీవిత - రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలు పిల్లలకు ఎంతో కొంత ఉపయోగపడతాయనే కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. మార్పు కోసమే పోరాటమని, లక్షల మందిలో ఒకరిగా ఉండటం ఇష్టం లేక దేశ సేవ కోసం పార్టీ పెట్టానన్నారు. పేదల బాధలు చూసి చలించిపోయానన్నారు. జాతీయ నేతల పుస్తకాలు చదివి లోతుగా అర్థం చేసుకున్నట్లు తెలిపారు. సోషలిజం - క్యాపిటలిజం వంటి సిద్ధాంతాలన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నానని చెప్పారు.

రాజకీయాల్లో మార్పు కావాలంటే సహనం కావాలని, కొన్నేళ్ల పోరాటంతోనే సాధ్యమవుతుందన్నారు. మార్పు కోసం యువత పదిహేనేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. ఇన్ స్టంట్ నూడుల్స్‌ లా వెంటనే ఫలితాలు వచ్చేయవని హితవు పలికారు. రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని - పంజాబ్‌ లో ఖలిస్థాన్‌ లో టెర్రరిజం- తమిళనాడులో ఎల్టీటీఈ - జర్మనీ విభజన - సౌతాఫ్రికా వర్ణ వివక్ష.. వేటికవే విరుద్ధమైన కలచివేసే అంశాలు అన్నారు. ఏళ్లు గడుస్తున్నా చెప్పుకోదగ్గ మార్పు లేదన్నారు. అవినీతి - వారసత్వ రాజకీయాలు చిరాకు కలిగిస్తాయన్నారు.

తాను మొదట్లో సినిమాలు చేస్తున్నప్పటికీ దేశం కోసం ఆలోచించేవాడినని, 2014లో రాష్ట్ర విభజన తనలో మార్పు తీసుకు వచ్చిందని - స్వార్థం - వ్యక్తిగత అవసరాల కోసం నేతలు ఎంత వరకు దిగజారారో చూశాక చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పారు. అందుకే సామాన్యులు, అణగారిన వర్గాలు - అన్యాయానికి గురైన బాధితుల పక్షాణ నిలబడాలని నిర్ణయించుకొని - పార్టీ స్థాపించానని చెప్పారు.