Begin typing your search above and press return to search.

ఏ యాంగిల్లో విజ‌య‌న‌గ‌రం చెప్పావ్ ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   1 Jun 2018 4:34 AM GMT
ఏ యాంగిల్లో విజ‌య‌న‌గ‌రం చెప్పావ్ ప‌వ‌న్‌?
X
డిమాండ్లు చేయ‌టం అంద‌రికి తెలిసిన విద్యే. ప్ర‌శ్నించే ప్ర‌తి ఒక్క‌రూ డిమాండ్లు చేసేస్తుంటారు. అయితే.. తాము చేసే డిమాండ్లు స‌హేతుకంగా ఉన్నాయా? లేదా? అన్న‌ది చూసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం కొంద‌రు చేస్తుంటారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు చూస్తుంటే ఇదే రీతిలో ఉన్న‌ట్లుగా అనిపిస్తోంది.

నిన్న మొన్న‌టివ‌ర‌కూ అధికారం గురించి పెద్ద‌గా మాట్లాడ‌ని ఆయ‌న‌.. ఇప్పుడు తాను అధికారంలోకి వ‌చ్చినంత‌నే అది చేస్తా.. ఇది చేస్తాన‌ని చెబుతున్నారు.

రాజ‌కీయాలు చేసేదే ప‌వ‌ర్ కోసం. పేరులోనే ప‌వ‌ర్ పెట్టుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు.. ప‌వ‌ర్ మీద పెద్ద ఆస‌క్తి ఉండ‌ద‌ని.. ఆయ‌న మిగిలిన వారికి చాలా భిన్న‌మైన వ్య‌క్తిగా ఆయ‌న్ను అభిమానించే వారు ప్ర‌చారం చేస్తుంటారు. తాజాగా ప‌వ‌న్ చేస్తున్న పోరాట యాత్ర‌ను ప‌రిశీలిస్తే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్ ను చేజిక్కించుకోవాల‌న్న త‌ప‌న ఆయ‌న మాట‌ల్లో స్ప‌ష్టంగా కనిపిస్తుంది.

గ‌తంలో ప‌వ‌న్ క‌నిపించినంత‌నే సీఎం.. సీఎం అంటూ ఆయ‌న అభిమానులు అదే ప‌నిగా అరుస్తుంటే పెద్ద‌గా స్పందించ‌ని ప‌వ‌న్‌.. ఇప్పుడు కొంచెం.. కొంచెం స్పందిస్తున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఎన్నిక‌ల మేనిఫేస్టో ను ప్ర‌క‌టిస్తాన‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. తాజాగా ఆస‌క్తిక‌ర స్టేట్ మెంట్ ఒక‌టి ఇచ్చారు.

తాను ప‌ర్య‌టిస్తున్న ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని వెనుక‌బాటుత‌నం గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న ఆయ‌న‌.. తాను కానీ అధికారంలోకి వ‌స్తే.. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను విజ‌య‌న‌గ‌రం తీసుకొస్తానంటూ భారీ హామీనే ఇచ్చేశారు. హైద‌రాబాద్‌ లో ఓ రేంజ్లో సెటిల్ అయిన చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను విజ‌య‌న‌గ‌రానికి తీసుకురావ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. ప‌వ‌న్ మాట‌లు మాత్రం చాలా సింఫుల్ గా తెచ్చేయొచ్చ‌న్న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్ మాట‌లు విన్న‌ప్పుడు.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర‌కూ ఎందుకు? ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను హైద‌రాబాద్ ను వ‌దిలిపెట్ట‌మ‌ను అన్న మాట రావ‌టం ఖాయం. ప‌వ‌న్ తోపాటు.. మెగా ఫ్యామిలీని విజ‌య‌న‌గ‌రానికి తీసుకొచ్చేస్తే ఒక ప‌ని అవుతుంది. ర‌వాణా సౌక‌ర్యాలు మొద‌లు.. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అనువైన మౌలిక స‌దుపాయాలు లేని విజ‌య‌న‌గ‌రాన్ని ఏ ప్రాతిప‌దికన ప‌వ‌న్ ఎంచుకున్నారో ఒక ప‌ట్టాన అర్థం కాదు.

హామీలు ఇవ్వ‌టం నేత‌ల‌కు అల‌వాటైన ప‌నే. కానీ.. తానిచ్చే హామీలు ప్రాక్టిక‌ల్ గా వ‌ర్క్ వుట్ అవుతుందో లేదోన‌న్న క‌నీస అవ‌గాహ‌న లేకుండా ఇవ్వ‌టంపైనే అభ్యంత‌ర‌మంతా. రాబోయే రోజుల్లో భోగాపురం ఎయిర్ పోర్ట్ క‌ట్ట‌నున్న నేప‌థ్యంలో.. ఎయిర్ క‌నెక్టివిటీ ఉంటుంద‌న్న ఉద్దేశంతో విజ‌య‌న‌గ‌రాన్ని టాలీవుడ్ ను తీసుకొచ్చేందుకు వీల‌వుతుంద‌ని అనుకున్నారా? లేదంటే మ‌రేదైనా ప్ర‌త్యేక కార‌ణంతో విజ‌య‌న‌గ‌రాన్ని ప‌వ‌న్ ప్ర‌స్తావించారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా.. ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌న‌గరానికి షిఫ్ట్ చేయ‌టం అంత తేలికైన విష‌యం కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి హామీల‌కు ముందు త‌న‌కు తానుగా చేసి చూపించి.. త‌న మాదిరే మిగిలిన వాళ్లు మార‌తార‌ని చెబితే అదో ప‌ద్ద‌తి. అందుకు భిన్నంగా మిగిలిన నేత‌ల మాదిరే నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే ప‌వ‌న్ ప్ర‌త్యేకత మిస్ అవుతుంద‌న్న‌ది ఆయ‌న గుర్తుంచుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.