Begin typing your search above and press return to search.

పవన్ మార్క్ బాంబు : విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో...?

By:  Tupaki Desk   |   15 Jun 2023 8:00 AM GMT
పవన్ మార్క్ బాంబు : విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో...?
X
పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో తాను కీలకం అంటున్నారు. తాను లేకుండా కాకుండా ఈసారి అసెంబ్లీ ఎలా ఎర్పాటు అవుతుందో చూస్తాను అని సవాల్ చేస్తున్నారు. గతసారి ఓడించారు, ఈసారి పక్కా నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటా అని గర్జించారు.

అదే సమయంలో సీఎం గా కూడా పదవి ఇస్తే తీసుకుంటా అంటూ బాంబు లాంటి వార్త పేల్చారు. సీఎం ఇచ్చేది ఎవరు అన్నది మాత్రం ఆయన చెప్పకపోవడమే పవన్ మార్క్ పాలిటిక్స్ అనుకోవాలి. నాకు పదవులు ముఖ్యం కాదు అని ఇటీవల దాకా పవన్ చెప్పారు.

వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చబోమని కూడా స్పష్టం చేశారు. వారాహి రధమెక్కగానే పవన్ టోన్ కొంత మారిందా అన్న చర్చ వస్తోంది. కత్తిపూడి జంక్షన్లో అశేషంగా వచ్చిన జనవాహిని చూసిన పవన్ విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో అంటూ సస్పెన్స్ లో పెట్టారు. పొత్తుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ టీడీపీని అలెర్ట్ చేసేలా స్టేట్మెంట్ ఇచ్చారు.

సీఎం పదవి ఇస్తే చాలా సంతోషంగా తీసుకుంటాను అన్న డైలాగ్ పొత్తు ధర్మంలో అధికార వాటాగానా లేక విడిగా పోటీ చేసి జనం మద్దతుతో అందుకునే విధానమా అన్నది అయితే పవన్ చెప్పలేదు మొత్తానికి పొత్తులు ఇంకా లేవు అంటూనే ఆయన యాత్ర స్టార్ట్ చేశారు.

అంటే బేరాలకు రాయబారాలకు అవకాశాలు ఉన్నాయి కానీ అది కూడా కండిషన్లు అప్లై అన్నట్లుగానే పవన్ మాట్లాడారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తుల విషయంలో జనసేనతో ఏమి మాట్లాడింది అన్నది ఎవరికీ తెలియదు. సీట్లు ఎన్ని ఇస్తారు అన్నది అంతకంటే తెలియదు.

కానీ పవన్ నోట మాత్రం విడిగా అంటూ రావడం ఏపీలో రాజకీయంలో కొత్త వేడిని తెచ్చేదే అంటున్నారు. నిన్నటిదాకా ఓట్లు చీలనివ్వను అంటూ సాగిన పవన్ స్పీచ్ ఇపుడు కాస్తా మారింది అని అంటున్నారు. లేకపోతే విడిగా అన్న మాట ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ తన సత్తా చాటడానికే వారాహి రధమెక్కారని అంటున్నారు. అటు అధికార పక్షాన్ని అదిలిస్తూ ఇటు టీడీపీకి కూడా తన బలమేంటో జనం సాక్షిగా చాటేందుకే ఆయన వారాహి ద్వారా ముందుకు వచ్చారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ స్పీచ్ లో క్లారిటీ అయితే కనిపిస్తోంది. తాను ఏపీ రాజకీయాల్లో కీలకం కావాలన్న తపన తొలి మీటింగులోనే చెప్పేశారు. అసెంబ్లీలో ఈసారి ఉంటా అనడం ద్వారా తన లక్ష్యాన్ని కూడా చెప్పేసారు. సీఎం అయితే ఓకే అంటూ గతంలో తనకు పదవులు వద్దు అన్న దాన్ని మార్చి జనసైనికులకు కిక్కెక్కించేలా మాట్లాడారు.

ఇవన్నీ చూస్తూంటే పవన్ వారాహి రధ యాత్ర రెండు వైపులా పదును అయిన కత్తిలా సాగుతోందా అన్నది కత్తిపూడి సభను చూస్తే చర్చకు వస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏంటి ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయన్నది రానున్న రోజులలో మరిన్ని సభల ద్వారా తెలియవచ్చు అని అంటున్నారు.