Begin typing your search above and press return to search.

పవన్.. ఫక్తు రాజకీయ నాయకుడు

By:  Tupaki Desk   |   22 Nov 2018 8:44 AM GMT
పవన్.. ఫక్తు రాజకీయ నాయకుడు
X
కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టే ప్రతి నాయకుడూ.. రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని.. వీటిని మార్చాల్సిన అవసరం ఉందని.. అందుకే తాను వచ్చానని అంటుంటాడు. కొత్త తరహా రాజకీయాలంటూ గొప్పలు పోతాడు. కానీ కొన్నాళ్లకు ఈ రొచ్చులో తానూ భాగమవుతాడు. అందరి లాగే రాజకీయాలు చేస్తాడు. సగటు రాజకీయ నాయకుడిలా మారిపోతాడు. తాను కూడా అందుకు భిన్నమేమీ కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాటి చెబుతున్నాడు. పార్టీ పెట్టిన మొదట్లో పవన్ వల్లించిన సిద్ధాంతాలేవీ ఇప్పుడు కనిపించట్లేదు.

గత కొన్ని నెలల్లో పవన్ మాటలు.. అతడి తీరు చూస్తే ఫక్తు రాజకీయ నాయకుడిగా పరిణామం చెందిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు ప్రాంతం.. కులం పట్టింపులేమీ లేనట్లు కనిపించిన పవన్.. ఈ మధ్య తన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమై.. అక్కడే సభలు.. సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. యాత్రలు చేస్తూ.. సగటు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మరోవైపు జనాల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టడంలోనూ పవన్ తీరు విస్మయానికి గురి చేస్తోంది.

తాజాగా పవన్ చెన్నైకి వెళ్లి అక్కడ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. పదేళ్లకు పైగా తెలంగాణలో అక్కడి నాయకులు ఆంధ్రా వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తూ వచ్చారని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్తాపం కలిగించిందన్నాడు. చెన్నైలో ఉన్నపుడు తానెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదన్నాడు. నిజానికి వేరే రాష్ట్రాలు.. భాషల వాళ్లపై వివక్ష చూపించడంలో తమిళ జనాలకు మించిన వాళ్లుండరు. ఇది దేశం మొత్తానికి తెలుసు. అక్కడి వాళ్ల వివక్ష భరించలేకే ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయారు మనవాళ్లు. అలాంటిది తమిళులు ఉదార స్వభావులు.. తెలంగాణ వాళ్లు వివక్ష చూపిస్తారు అన్నట్లు మాట్లాడటం పవన్ కే చెల్లింది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి హైదరాబాద్ లో ఇరు రాష్ట్రాల వాళ్లూ సామరస్యంగా జీవనం సాగిస్తున్న సమయంలో చెన్నైకి వెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో పవన్ ఆంతర్యమేంటో?