Begin typing your search above and press return to search.

ఓటేశాక పవన్ కు తత్త్వం బోధపడిందా?

By:  Tupaki Desk   |   11 April 2019 9:26 AM GMT
ఓటేశాక పవన్ కు తత్త్వం బోధపడిందా?
X
జనసేన అధ్యక్షుడు పవన్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. రాష్ట్రంలోని చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయని.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాకలోనూ ఇదే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ఈవీఎంల మొరాయింపుపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

ఇక ఈ ఎన్నికల గురించి.. తను తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో ఓటేయ్యడంపై పవన్ స్పందించారు. ‘ఇది నా మొదటి ఎన్నిక కాదని.. మూడవదని.. నేను ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. ఫలితం ఏదైనా సరే ఇక్కడే ఉండి ప్రజల కోసం పోరాడుతాను’ అని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.

కాగా పవన్ ఈ ఎన్నికల్లో గెలిచానా.. ఓడినా ఫలితం ఏదైనా అనడంపై విమర్శకులు కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కు తాను ఏపీ ఎన్నికల్లో గెలవడం అంత ఈజీకాదని.. వాస్తవ పరిస్థితి అర్థమైందని.. అందుకే ఈ ఎన్నికల్లో విజయం సాధించలేననే వాస్తవాన్ని పవన్ గ్రహించి ఇలా మాట్లాడారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పవన్ తొలిసారిగా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరుఫున 2009లో ప్రచారం చేశారు. ఇక 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీచేయకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. ఇప్పుడు 2019 ఎన్నికల వేళ స్వతంత్రంగా ఏపీలో పోటీచేస్తున్నారు.

ఇక జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి తాజాగా కడప జిల్లాలో పోలింగ్ బూత్ లో ఈవీఎం మిషన్ ను పగలకొట్టడంపై పవన్ తెలివిగా.. జాగ్రత్తగా స్పందించారు. ‘ఆ సంఘటనలో నిజనిజాలు ఎంటో నాకు పూర్తిగా తెలియదు.. దానిని పరిశీలించిన తర్వాత స్పందిస్తాను’ అంటూ దాటవేశారు. ఇలా పవన్ ప్రస్తుత రాజకీయాలను వేగంగా ఓన్ చేసుకొని అందుకు తగ్గట్టుగా ప్రవర్తించడం విశేషం.