Begin typing your search above and press return to search.

అమరావతిని ఆపేస్తాం.. : పవన్ కల్యాణ్

By:  Tupaki Desk   |   28 July 2018 2:08 PM GMT
అమరావతిని ఆపేస్తాం.. : పవన్ కల్యాణ్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తారు. 2013 భూ సేకరణ చట్టం- పరిరక్షణ పేరిట విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏపీలోని ప‌రిణామాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. విజయవాడలో 2013 భూ సేకరణ చట్టం పరిరక్షణ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు సుప్రీం మాజీ జడ్జీ జస్టిస్ గోపాల గౌడ - ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు - జనసేన అధినేత పవన్ - సీపీఎం - సీపీఐ నేతలు పి.మధు - రామకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అమరావతిని ఆపేస్తాం.. రాజధానిని అడ్డుకుంటామ‌ని తెలిపారు. ఇష్టమొచ్చినట్లుగా భూ దోపిడికి పాల్పడవద్దని..పాలకులు చెప్పినట్లుగా కాకుండా చట్టంలో పేర్కొనే విధంగా అధికారులు వ్యవహరించాలని కోరారు.

ఐదు సంవత్సరాలకు ఎన్నికైన వారు 50 సంవత్సరాల సరిపడాల్సింది దోచేస్తున్నారని..అందుకే ప్రశ్నించాల్సినవసరం ఉందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. రాజధాని నిర్మాణ సమయంలో తాను సీఎం చంద్రబాబు నాయుడితో మాట్లాడడం జరిగిందని - భూ సేకరణ సమయంలో రైతులకు ఎలాంటి నష్టం కలిగించమని పేర్కొనడం జరిగిందన్నారు. లక్ష ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారని..ఇంత స్థలం ఏమి చేస్తారని ప్రశ్నించారు. విశాఖ స్టీలు ప్లాంటు కోసం భూ సేకరణ చేశారని..కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. పర్యావరణం ధ్వంసం చేస్తూ రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారని సూటిగా ప్రశ్నించారు. పాలకులు చెబుతున్నట్లుగా కాకుండా అధికారులు చట్టం ప్రకారం వ్యవహరించాలని, లేనిపక్షంలో వారిపై కూడా యుద్ధం చేస్తామన్నారు. వామపక్షాలు..ఇతరులతో కలిసి మహారాష్ట్ర తరహా ఉద్యమం చేపట్టి సీఎం ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. అమరావతిని ఆపేస్తాం.. రాజధానిని అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. కేసులు పెడితే ఎదురు తిరగండి. మీకు అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తులపై ఆలోచిస్తా.. ఇప్పుడు ఉద్యమాలేనని వివరించారు.

చంద్రబాబు రాహుల్‌ కు కన్నుకొట్టి మనమంతా ఒక్కటే అనగలరని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎద్దేవా చేశారు. 1,850 ఎకరాల్లోనే రాజధాని అన్నారు. ఇప్పుడు రాజధాని లక్ష ఎకరాలకు చేరింది. బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా? అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? అని బాబును ప్రశ్నించారు. ప్రజలు తోలు తీస్తారు.. గుర్తు పెట్టుకోండి. నేను ప్రజలను కదిలించగలను. డబ్బుతో నన్ను కొనలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ఎంతో తపన పడుతున్నారని..అన్యాయం జరుగుతోంది..అంటూ ఆయన మాటల వెనుక ఎంతో అంతర్యం ఉందన్నారు. గోదావరి జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో పర్యావరణం కలుషితమైందిగా గుర్తించానన్నారు. నీళ్లు కలుషితమయ్యాయని, తాను ఉన్న హోటల్ లో కూడా పసుపు పచ్చని నీళ్లు వచ్చాయన్నారు. పర్యావరణాన్ని తల్లిగా కాపాడుకోవాలని చెబుతున్నారని..భీమవరంలో ఒక డంపింగ్ యార్డు లేక నదీ జలాలు కలుషితమవుతున్నాయని..ఎవరూ మాట్లాడడం లేదన్నారు.