Begin typing your search above and press return to search.

ఆమరణ దీక్షను అటకెక్కించిన పవన్ కల్యాణ్

By:  Tupaki Desk   |   12 April 2018 12:53 PM GMT
ఆమరణ దీక్షను అటకెక్కించిన పవన్ కల్యాణ్
X
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. గురువారం నాడు తన కూటమిలోని మిత్రపక్షాల నాయకులతో హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. పవన్ మిత్రపక్షాల కీలక నాయకులతో సమావేశం అనగానే.. రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అసలే రాష్ట్రం మొత్తం ఉద్యమాలు - పోరాట ప్రణాళికలతో అట్టుడుకుతున్న తరుణంలో.. ప్రత్యేకహోదా సాధించడం కోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ పవన్ కల్యాణ్ ప్రకటించడం అనేది ఇప్పుడు కార్యరూపం దాల్చవచ్చునని ఊహాగానాలు సాగాయి. అయితే కొన్ని గంటల పాటు జరిగిన భేటీ తర్వాత.. మీడియాకు వివరాలు వెల్లడించిన పవన్ కల్యాణ్ ఎంచక్కా ఆమరణ నిరాహార దీక్ష అనే పాయింటు మాటెత్తకుండా.. దానిని అటకెక్కించేయడం గమనార్హం.

హోదా సాధించడం కోసం.. ఇప్పటికే వివిధ పార్టీల వివిధ స్థాయిల్లో ఆమరణ నిరాహార దీక్షలు చేశాయి. ఈ విషయంలో వైకాపా కు కొన్ని ఎక్కువ మార్కులు పడతాయి. తెదేపా ప్లకార్డులు తప్ప నిరాహార దీక్షలకు దిగకపోయినా.. కనీసం ఆ పార్టీ కిందిస్థాయి నాయకులు కొందరు అలాంటి దీక్షలు చేశారు. వామపక్షాలు కాంగ్రెస్ కూడా దీక్షలు చేశాయి.

ఈ విషయంలో నిర్దిష్టంగా అలాంటి దీక్షలు చేయకుండా ఉన్నది జనసేన మాత్రమే. అదే పవన్ కల్యాణ్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటేగనుక.. సంచలనం అవుతుందని.. యూత్ లో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా.. పవన్ దీక్ష ప్రకంపనాలు సృష్టిస్తుందని అభిమానులు ఆశించారు. చాలా మంది అనుకున్నారు.

పవన్ కల్యాణ్ కూడా తాను .. జనాన్ని ఇబ్బంది పెట్టే ధర్నాలు - బంద్ లు చేయనని - తానే ఆమరణ దీక్షకు కూర్చుని సాధిస్తాను తప్ప.. మరో మార్గం తొక్కనని తేల్చిచెప్పారు. కానీ ప్రస్తుతం ఆయన రెగ్యులర్ రాజకీయాలే నడుపుతన్నట్లుగా ఉంది. ఎటూ రాష్ట్ర వ్యాప్త పోరాటం నడిపేంత బలం సొంతంగా తమ పార్టీకి లేదు గనుక.. ఆయన చాలా తెలివిగా 16వ తేదీన హోదా సాధన సమితి చేస్తున్న బంద్ కు తాము మద్దతు ఇస్తాం అని.. జనసేన- వామపక్ష కూటమి కార్యకర్తలంతా అందులో పాల్గొంటారని ప్రకటించారు. ఆయన దీక్ష ప్రకటన ఉంటుందని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశ తప్పలేదు. పవన్ చాలా కన్వీనియెంట్ గా తన దీక్ష సంగతిని అటకెక్కించారని అర్థమవుతోంది.