Begin typing your search above and press return to search.

జనసేనలో ఇక పవన్ ఒక్కడేనా?

By:  Tupaki Desk   |   16 July 2019 8:01 AM GMT
జనసేనలో ఇక పవన్ ఒక్కడేనా?
X
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముచ్చట ఇదీ.. ఏపీ బరిలో మూడుప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన పోటీపడ్డాయి. వైసీపీ గెలిచింది. టీడీపీ అధికారం కోల్పోయింది. రెండు పార్టీలు బాగానే ఉన్నాయి. కానీ ఎన్నో ఆశలతో పోటీచేసిన జనసేన మాత్రం కుదేలైంది. జనసేనాని ఓడిపోగా.. ఒక్కరే ఆ పార్టీ నుంచి గెలిచారు. కాంగ్రెస్, బీజేపీలైతే ఖాతా తెరవలేదు.

ఎన్నికల తర్వాత ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంది.. ఇప్పుడు అధికార వైసీపీని, ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ దూసుకువస్తోంది. అస్సలు జనసేన ఉనికే లేని పరిస్థితి ఏపీలో దాపురించింది. టీడీపీని మొత్తంగా లాగేసి జగన్ కు ప్రతిపక్షంగా ఉండాలని బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని బీజేపీ కేంద్రంలో అధికారం చూసుకొని ఇంతలా దూసుకువెళ్తుంటే జనసేన పరిస్థితి మాత్రం రోజురోజుకు తీసికట్టుగా మారుతోంది.

జనసేనలో అధ్యక్షుడు పవన్ తర్వాత అంతటి బలమైన నేత నాదెండ్ల మనోహర్. తెనాలి నుంచి పోటీచేసి ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు 10 ఏళ్లు రాజకీయం చేస్తానని పవన్ అంటున్నా నాదెండ్ల అన్నేళ్లు ఓపిగా ఆయన వెంట ఉండే పరిస్థితి లేనట్టు కనిపిస్తోంది.

ఇటీవలే నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరారు. అమిత్ షా సమక్షంలో కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నాదెండ్ల మనోహర్ కు ఈ విషయం చెప్పే చేరారట భాస్కర్ రావు. అమెరికా నుంచి వచ్చాక తన నిర్ణయం కూడా చెబుతానని మనోహర్ చెప్పారని భాస్కర్ రావు మీడియాతో వెల్లడించడం సంచలనంగా మారింది. సో తండ్రిని ముందు పంపి తనయుడు కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లేనని నాదెండ్ల భాస్కరరావు మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ లెక్కన జనసేనాని పవన్ కు త్వరలోనే నాదెండ్ల మనోహర్ షాక్ ఇవ్వబోతున్నట్టు రాజకీయంగా చర్చ సాగుతోంది.