Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి పదవి వరించి రావాలి... పవన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   11 May 2023 5:56 PM GMT
ముఖ్యమంత్రి పదవి వరించి రావాలి... పవన్ సంచలన వ్యాఖ్యలు
X
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి అన్నది కండిషన్లు పెట్టో బేరమాడో తెచ్చుకుంటే వచ్చేది కాదు అని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాతో పవన్ మాట్లాడుతూ తనకు తెలుగుదేశం పార్టీ వారు సీఎం సీటు ఎందుకు ఆఫర్ చేస్తారు అని ప్రశ్నించారు. అలాగే బీజేపీ వారు తనని సీఎం అని ఎందుకు అంటారని ఆయన అంటున్నారు.

తానే తెలుగుదేశం బీజేపీ పార్టీల ప్రెసిడెంటుని అయితే అలా ఆలోచించను కదా అని ఆయన అంటున్నారు. తన కష్టం మీదనే సీఎం పదవిని సాధిస్తాను అలాగే తనకు ఆనందం అని ఆయన చెప్పుకొచ్చారు. తాను సినిమా రంగంలో సూపర్ స్టార్ డం ని ఒక్క రోజులో సాధించలేదని గుర్తు చేశారు

తానే కష్టపడి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. రాజకీయాలలో కూడా తాను అలాగే రావాలని అనుకుంటున్నాను అని అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడడం లేదని అన్నారు. అది వరించి వచ్చినపుడు వస్తుందని ఆయన అంటున్నారు.

ఇక 2019 ఎన్నికల్లఒ తన పార్టీ 137 సీట్లకు పోటీ చేసిందని, కనీసం ముప్పయి నుంచి నలభై సీట్లలో గెలిపించి ఉంటే తాను కుమారస్వామి మాదిరిగా సీఎం అయి ఉండేవాడిని అని అన్నారు. ఈ రోజు సలహాలు చెప్పేవారు నాడు ఎందుకు జనసేనకు నలభై సీట్లు ఇవ్వలేకపోయారు అని ఆయన అన్నారు.

తాను రాష్ట్రం కోసం ఉన్నతంగా ఆలోచిస్తున్నాను అని అన్నారు. తనను అర్ధం చేసుకునే వారు కూడా విశాలంగా ఆలోచించాలని కోరారు. తాను ఎవరి జెండానో మోయడానికి పార్టీ పెట్టలేదని, ఏపీని అభివృద్ధి చెందడానికి ఏపీని పరిరక్షించడానికే తాను జనసేనను పెట్టాను అని అన్నారు.

తాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకుండా చూస్తాను అని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా అందరినీ కలుపుకుని వెళ్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యం తప్ప మరోటి కాదని పవన్ మళ్లీ చెప్పడం విశేషం. ఏపీలో ఈసారి కలసి వచ్చే పార్టీలను అన్నింటినీ కలుపుకుని ముందుకు సాగుతామని ఆయన అన్నారు.

పొత్తులు కచ్చితంగా పెట్టుకుని ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ఏపీలో రాజకీయం ఈసారి మారాల్సిందే వైసీపీ అధికారం నుంచి తొలగి పోవాల్సిందే అని పవన్ చెప్పడం విశేషం. మొత్తానికి పవన్ క్లారిటీ ఇచ్చేశారు. తాను సీఎం పదవిని సొంతంగా సాధించుకుంటాను అని అంటూనే వైసీపీని గద్దె దింపడమే తన మొదటి లక్ష్యమని చెప్పేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో పవన్ ఆలోచనలు పొత్తులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవాల్సిందే అంటున్నారు.