Begin typing your search above and press return to search.

మెచ్చిన జ‌న‌సైనికుల‌తో ప‌వ‌న్ సెల్ఫీ

By:  Tupaki Desk   |   25 Oct 2017 4:38 AM GMT
మెచ్చిన జ‌న‌సైనికుల‌తో ప‌వ‌న్ సెల్ఫీ
X
పార్టీని పూర్తి స్థాయిలో షురూ చేయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ ముచ్చ‌ట చెప్పాలంటే చాలానే ఉంది. వ‌న్ మ్యాన్ ఆర్మీ మాదిరి ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన‌లో ఆయ‌న కాక ఇంకెవ‌రు? అన్న మాట‌కు కొన్ని పేర్లు వినిపిస్తాయి. అంత‌లోనే.. నా పార్టీలో నేను త‌ప్పించి ఇంకెవ‌రూ బాధ్యులు కార‌న్న‌ట్లుగా ప‌వ‌న్ మాట‌లు ఉంటాయి.

మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు త‌గ్గ‌ట్లే.. జ‌న‌సేన‌కు సైతం నేత‌ల తీరు మ‌హా ఇబ్బందిగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌న‌సేన పార్టీ నేత‌ల‌మ‌ని చెప్పుకొని వ‌సూళ్ల‌కు పాల్ప‌డేవారు.. మోసాలు చేసే వారికి కొద‌వ‌లేదు. దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తుంటారు జ‌న‌సేనాధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.

ఇదిలా ఉంటే త్వ‌ర‌లో పార్టీని విస్త‌రించ‌టంతో పాటు.. పెద్ద ఎత్తున కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు వీలుగా క‌స‌ర‌త్తు చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మెరిక‌ల్లాంటి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని త‌యారు చేసే ప‌నిలో మునిగిపోయార‌ని చెబుతుంటారు. పార్టీ అంత‌ర్గ‌త నిర్మాణం మీద ఫోక‌స్ చేసి.. మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు భిన్నంగా త‌న పార్టీని నిల‌పాల‌న్న ధోర‌ణిలో ఉన్న‌ట్లు చెబుతారు. రాజ‌కీయ పార్టీ అన్న వెంట‌నే ప‌వ‌ర్ చుట్టూ రాజ‌కీయాలు చేసే ధోర‌ణికి భిన్నంగా జ‌న‌సేన‌ను నిల‌పాల‌ని ఆయ‌న త‌పిస్తుంటారు. ఇందులో భాగంగా సేవ మీద త‌ప్పించి.. అధికారం మీద యావ వ‌ద్దంటూ త‌న కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ నూరిపోస్తుంటారు.

త్వ‌ర‌లో క్రియాశీల రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టేందుకు హోంవ‌ర్క్ చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాజాగా ఒక కొత్త త‌ర‌హా ట్రెండ్‌కు తెర తీశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో క‌మిట్ మెంట్ పెంచేందుకు వీలుగా ఆయ‌న రూపాయి కూడా ఖ‌ర్చు కాని రీతిలో కొత్త త‌ర‌హా స్కీంను ఎంచుకున్న‌ట్లుగా తెలుస్తోంది. పార్టీలో క‌మిట్ మెంట్ తో ప‌ని చేసే జ‌న‌సైనికుల్ని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసేందుకు.. వారికి సరికొత్త ఇమేజ్‌ను సృష్టించేందుకు వీలుగా సోష‌ల్ మీడియాను ఎంపిక చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

తాజాగా నిమ్మ‌ల వీర‌న్న అనే జ‌న‌సైనికుడితో క‌లిసి ప‌వ‌న్ సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ప‌వ‌న్‌.. సామాజిక ప‌రివ‌ర్త‌న కోసం అలుపెర‌గ‌క ప‌ని చేస్తున్న గొప్ప కార్య‌క‌ర్త అంటూ పొగిడేశారు. ట్విట్ట‌ర్ లో పెట్టిన ఈ పోస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ త‌ర‌హాలో పోస్టులు పెట్ట‌టం పార్టీలోని మిగిలిన వారికి స్ఫూర్తివంతంగా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. కానీ.. ఇబ్బంది అంతా..ఇలా తాను మెచ్చిన జ‌న‌సైనికుల మీద ఆరోప‌ణ‌లు వ‌స్తే ప‌వ‌న్ రియాక్ష‌న్ ఏంద‌న్న‌ది సందేహం. పార్టీ కోసం బాగా ప‌ని చేసే వాళ్ల‌కు త‌న‌తో సెల్ఫీ ఛాన్స్ తో పాటు.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ కావొచ్చ‌న్న స్కీం బాగానే ఉన్నా.. రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తిస్తే మంచిదంటున్నారు. బీకేర్ ఫుల్ ప‌వ‌న్‌!