Begin typing your search above and press return to search.

తిరుమ‌ల‌లో ఆ టాపిక్ మాట్లాడ‌న‌న్న‌ప‌వ‌న్

By:  Tupaki Desk   |   13 May 2018 9:04 AM GMT
తిరుమ‌ల‌లో ఆ టాపిక్ మాట్లాడ‌న‌న్న‌ప‌వ‌న్
X
చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి ప‌రిణామం చోటు చేసుకుంది. నిద్ర లేచించి మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ రాజ‌కీయం గురించి మాత్ర‌మే మాట్లాడ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటు. ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత తమ మ‌న‌సులో అనుకున్న‌ది ఫోన్లో పెట్టేసి.. సెండ్ బ‌ట‌న్ నొక్కితే చాలు.. ప్ర‌పంచం మొత్తానికి చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసే ప‌రిస్థితి.

ఇలాంటి వేళ కూడా పుణ్య‌క్షేత్రాల‌కు వ‌చ్చిన‌ప్పుడు.. అధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేట‌ప్పుడు ద‌రిద్ర‌పుగొట్టు రాజ‌కీయాల గురించి మాట్లాడే తీరు చాలామంది నేత‌ల్లో క‌నిపిస్తూ ఉంటుంది. గ‌తంలో తిరుమ‌ల‌కు వెళ్లిన వారు.. స్వామి వారి ద‌ర్శ‌నం త‌ర్వాత జ‌న‌ర‌ల్ మాట‌లు త‌ప్పించి రాజ‌కీయాల ప్ర‌స్తావ‌నే తీసుకొచ్చేవారు కాదు. మారిన రాజ‌కీయంతో.. స్వామి వారి స‌న్నిధిలోనూ రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీనిపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు కూడా. తాజాగా తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ తాను రాజ‌కీయాల గురించి మాట్లాడ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

స్వామి వారి ఆశీస్సుల కోసం తాను తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను చెప్పేందుకు సైతం నిరాక‌రించారు. త‌న చిన్న‌త‌నంలో అన్న‌ప్రాస‌న‌.. నామ‌క‌ర‌ణం స్వామి వారి స‌న్నిధిలోనే జ‌రిగింద‌న్న ప‌వ‌న్‌.. టికెట్ కొనుగోలు చేసి సాధార‌ణ భ‌క్తుడి మాదిరి ద‌ర్శ‌నానికి వెళ్లటం గ‌మనార్హం.

ప‌వ‌న్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవ‌టంతో వారిని కంట్రోల్ చేయ‌టం భ‌ద్ర‌తా సిబ్బందికి క‌ష్టంగా మారింది. తోపులాట‌ల మ‌ధ్య‌నే ప‌వ‌న్ త‌న కాన్వాయ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు తిరుమ‌ల‌లో ఉండ‌నున్న ప‌వ‌న్‌.. అనంత‌రం బ‌స్సు యాత్ర చేప‌ట్టే వీలుంద‌ని.. ఇచ్చాపురం నుంచి ఆయ‌న యాత్ర స్టార్ట్ అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ రోజు (ఆదివారం) ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో టికెట్ మీద ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం చేసుకున్న ప‌వ‌న్ కు ద‌ర్శ‌నం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద పండితులు ఆశీర్వ‌దించారు. ఆల‌య అధికారులు స్వామి వారి వ‌స్త్రంతో స‌త్క‌రించి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు. త‌న రాక సంద‌ర్భంగా సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల‌ని ప‌వ‌న్ అధికారుల్ని ముందే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.