Begin typing your search above and press return to search.

జగన్‘ఈగో’ ఎలాంటిదో చెప్పిన పవన్.. ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   21 Feb 2022 6:12 AM GMT
జగన్‘ఈగో’ ఎలాంటిదో చెప్పిన పవన్.. ఏమన్నారంటే?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జనం మధ్యకు వచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీదా.. దానికి ప్రభుత్వ జారీ చేసే జీవోల మీద గళం విప్పే ప్రయత్నం చేసిన ఆయన.. ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 217పై ఆయన మండిపడ్డారు.

మత్స్యకారుల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఉన్న జీవో 217ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. వారి ప్రయోజనాల్ని దెబ్బ తీసే జీవోను తక్షణం రద్దు చేయాలన్న డిమాండ్ చేశారు. నరసాపురంలో ఏర్పాటు చేసిన మత్స్యకార అభ్యున్నత సభలో ప్రసంగించారు పవన్ కల్యాణ్.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదునైన విమర్శల్ని సంధించిన ఆయన.. జగన్ వ్యక్తిగత వ్యవహర శైలి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు.

ఎంత పెద్ద వారైనా సరే.. జగన్ ముందు చేతులు కట్టుకొని.. మాకు సాయం చేయాలి సార్ అని వెళ్లాలని.. అప్పుడు మాత్రమే ఆయన అహం సంతృప్తి చెందుతుందన్నారు. అందరూ తన వద్ద తగ్గారనే సంతృప్తి ఆయనకు కలుగుతుందన్న పవన్.. జగన్ మైండ్ సెట్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసేందుకు అస్సలు వెనుకాడలేదు.

అందరూ దేహీ అనాలన్నదే వైసీపీ వారి ఆలోచనా విధానంగా ఆయన మండిపడ్డారు. ఎంత పెద్దలు అయినా సరే.. ‘‘జగన్ గారు మీరు పెద్దలు. మాకు సాయం చేయాలి సార్ అని ఆయన వద్దకు వెళ్లాలి.

అప్పుడే ఆయన అహం సంతృప్తి చెందుతుంది. అందరూ తన వద్ద తగ్గారనే తృప్తి కలుగుతుంది’’ అంటూ మండిపడిన ఆయన.. వైసీపీ నేతలు రాచరికంతో వ్యవహరిస్తుంటే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. నరసాపురం బహిరంగ సభలో జగన్ మైండ్ సెట్ ను ఉద్దేశించి పవన్ చేసిన హాట్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఆయన మాటల వెనుక అసలు అర్థం.. ఇటీవల సినీ పెద్దలతో సీఎం సమావేశంగా అభివర్ణిస్తున్నారు.