Begin typing your search above and press return to search.

ప్ర‌జారాజ్యం ఓట‌మి!...పీకే కారణాలు చెప్పేశారు!

By:  Tupaki Desk   |   5 Jan 2019 2:16 PM GMT
ప్ర‌జారాజ్యం ఓట‌మి!...పీకే కారణాలు చెప్పేశారు!
X
అప్ప‌టిదాకా తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌కంటూ ఎదురు లేని స్థాయికి చేరిన మెగాస్టార్ చిరంజీవి... 2008లో అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అస‌లే మెగాస్టార్‌, ఆపై రాజ‌కీయ‌మంటే మాట‌లు కాదు క‌దా... జ‌నం తండోప‌తండాలుగా వ‌చ్చారు. తిరుప‌తిలో నిర్వ‌హించిన ఆవిర్భావ స‌భ‌ను నిర్వ‌హించిన చిరు.... ఆ స‌భ‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూసి... తాను అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే అనుకున్నారు. అయితే ఏమైంది? త‌న సొంతూరులోనే ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగిన ఓ మ‌హిళ చేతిలో స్వయంగా చిరు ఓట‌మిపాల‌య్యారు. అయితే పార్టీ ఆవిర్భావ స‌భనో, లేదంటే తన సామాజిక ఓట‌ర్లు అత్య‌ధికంగా ఉండ‌ట‌మో తెలియ‌దు గానీ... తిరుప‌తి నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత పార్టీని గంప‌గుత్త‌గా కాంగ్రెస్‌ లో విలీనం చేసేసి... ఓ కేంద్ర మంత్రి ప‌ద‌వితో చిరు స‌రిపెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో జ‌రిగిన ప‌రిణామాలన్నింటినీ ఓ సారి బేరీజు వేసుకున్న చిరు... త‌న‌కు రాజ‌కీయాలు అచ్చి రాలేద‌ని తీర్మానించేసుకున్నారు. త‌న‌కు నేమూ, ఫేమూ తెచ్చిన సినిమా రంగానికి తిరిగి వ‌చ్చేశారు. సినిమాల్లో బాగా గ్యాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మెగాస్టార్‌ గా చిరు త‌న స్టామినాను మ‌రోమారు నిరూపించుకోగ‌లిగారు.

ఇదంతా గ‌తం అయితే... చిరు సోద‌రుడిగా టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి ప‌వ‌ర్ స్టార్‌ గా ఎదిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇప్పుడు జ‌న‌సేన పేరిట ఓ రాజ‌కీయ పార్టీని స్థాపించారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందే పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌.... ఆ ఎన్నిక‌ల్లో పోటీకి సై అన‌లేక‌పోయారు. టీడీపీకి, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆ మ‌ద్ద‌తుతోనే ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ... పీకేకు మెరుగైన ప్రాధాన్యం ఇచ్చినా... ప‌వ‌న్ ఎందుక‌నో టీడీపీకి దూరం జ‌రిగారు. ఇప్పుడు 2019 ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌త్య‌క్ష పోటీకి సై అన్న ప‌వ‌న్‌... ఏపీలోని మొత్తం 175 స్థానాల్లోనూ త‌న పార్టీ అభ్యర్థులు బ‌రిలోకి దిగుతార‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.... వ‌రుస‌గా జిల్లాల నాయ‌కుల‌తో భేటీలు నిర్వ‌హిస్తున్న ప‌వ‌న్‌... నేడు ప్ర‌కాశం జిల్లా పార్టీ శ్రేణుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో జ‌న‌సేన గురించి ఓ మోస్త‌రుగా మాట్లాడిన ప‌వ‌న్‌... గ‌తంగా మారిన ప్ర‌జారాజ్యంపై కాస్తంత ఎమోష‌నల్‌ గా మాట్లాడారు. అయినా పాత చేదు జ్ఞాప‌క‌ల‌ను ఇప్పుడు ప‌వ‌న్ ఎందుకు నెమ‌రువేసుకున్నార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ప్ర‌జారాజ్యం వైఫ‌ల్యం పై ఆయ‌న మాట్లాడిన తీరు కాస్తంత ఎమోష‌న‌ల్‌ గానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌జారాజ్యం వైఫ‌ల్యానికి తానో, త‌న సోద‌రుడు చిరునో కార‌ణం కాద‌ని పేర్కొన్న ప‌వ‌న్‌... పార్టీలో చేరిన కొంద‌రు ఓపిక లేని నేతల కార‌ణంగానే పార్టీ ఓట‌మిపాలైంద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా... నాడు ప్ర‌జారాజ్యం అధికారం చేప‌ట్టి ఉంటే... రాష్ట్రంలో సామాజిక న్యాయం జ‌రిగి ఉండేద‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఇలా సాగాయి. *ప్ర‌జారాజ్యం అధికారంలోకి వ‌చ్చి ఉంటే... సామాజిక న్యాయం జ‌రిగి ఉండేది. ఓపిక లేని నాయ‌కులు ప్ర‌జారాజ్యంలో చేరినందువ‌ల్లే అవ‌కాశం చేజారింది. స‌ద‌రు నేత‌లు ప‌ద‌వీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బ‌ల‌మైన వ్య‌క్తిని బ‌ల‌హీనుడిగా మార్చేశారు. పీఆర్పీ ఆవిర్భావానికి బ‌ల‌మైన‌ పాత్ర పోషంచిన వారిలో నేను ఒక‌ణ్ణి. రాజ‌కీయాలు ఇప్పుడు సంపూర్ణంగా వ్యాపారం అయిపోయాయి. రాజ‌కీయాలు వ్యాపారమైతే.. సేవా భావం క్షీణించిపోతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 60 శాతం మంది కొత్త యువ‌కుల‌ను బ‌రిలో నిలుపుతా. భావ‌జాలం లేని పార్టీలు రాజ్యాలు ఏలుతున్న త‌రుణం ఇది. అందుకే నేను కొత్త పార్టీని స్థాపించా. సినిమాలు ఎప్పుడూ సంపూర్ణంగా సంతృప్తి ఇవ్వ‌లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన‌ప్పుడే సంపూర్ణ ఆనందం. రాజ‌కీయాలు న‌డ‌ప‌డానికి డ‌బ్బు అవ‌స‌రం లేదు. 2014లో రాష్ట్ర స‌మ‌గ్ర‌త కోసం టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చాం. 2019లో రాష్ట్ర స‌మ‌తుల్యం కోసం అన్నిస్థానాల్లో పోటీ చేస్తున్నాం* అంటూ త‌న‌దైన ఫ్లోలో మాట్లాడేసిన ప‌వ‌న్‌... ప్ర‌జారాజ్యం ఓట‌మికి కార‌ణ‌మైన వారి జాబితాను మాత్రం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.