Begin typing your search above and press return to search.

గిరిజన ఎమ్మెల్యే చనిపోతే కానీ బాబుకు గిరిజనులు గుర్తు రాలేదా?

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:23 PM GMT
గిరిజన ఎమ్మెల్యే చనిపోతే కానీ బాబుకు గిరిజనులు గుర్తు రాలేదా?
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి ఒక ముస్లింనేతను, గిరిజన నేతను తీసుకున్న మరుసటి రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక గిరిజన ఎమ్మెల్యే చనిపోతే కానీ చంద్రబాబుకు గిరిజనులు గుర్తుకురాలేదని ఆరోపించారు. గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావును మావోయిస్టులు చంపడంతో ఇప్పుడాయన కుమారుడిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని.. ఇంతవరకు కేబినెట్లో గిరిజనులకు ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు.

చంద్రబాబుకు గిరిజనులపై ఏమాత్రం ప్రేమలేదని ఆయన గతంలోనూ ఆరోపించారు. ఇటీవల ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని వంతాడ మైనింగ్ స్థలాలను పరిశీలించి అక్కడా చంద్రబాబుపై మండిపడ్డారు. గిరిజనుల భూములను బలవంతంగా లాక్కుని అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు కనీసవసతులైన స్కూళ్లు, ఆసుపత్రుల సౌకర్యం కల్పించని చంద్రబాబు అక్కడ భూముల్లో మైనింగ్‌కు తనవారికి అనుమతిలిచ్చి గిరిజనుల సంపదను దోచుకుంటున్నారని పవన్ గతంలోనూ విరుచుకుపడ్డారు.

మరోవైపు పవన్ ముస్లింలతో మంగళవారం కాకినాడలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. చంద్రబాబు కేబినెట్లోకి ముస్లిం నేతను తీసుకున్న మరునాడే పవన్ ఆ వర్గంతో సమావేశమయ్యారు. ముందే నిర్ణయమైన సభ అయినప్పటికీ ముస్లింలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన ఆయన అదేసమయంలో చంద్రబాబు తీరునూ ఎండగట్టారు.