Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీల‌ను యువ‌త ప్ర‌శ్నించాలి:పవ‌న్

By:  Tupaki Desk   |   29 Jun 2018 12:51 PM GMT
టీడీపీ ఎంపీల‌ను యువ‌త ప్ర‌శ్నించాలి:పవ‌న్
X
దీక్ష‌ల‌పై ఏపీ భ‌వ‌న్ లో టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ సాధ‌నే ల‌క్ష్యంగా కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీలు....తమ తోటి ఎంపీ ర‌మేష్ చేస్తోన్న దీక్ష‌పై సెటైర్లు వేసుకుంటోన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఏవండీ.....నాకు 5 కేజీల బరువు తగ్గాలని ఉంది.. అవకాశమిస్తే వారం రోజుల దీక్ష చేయ‌గ‌ల‌ను....అంటూ ఎంపీ ముర‌ళీ మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపాయి. ఇదిగో డాన్....ఆయ‌న చేత దీక్ష చేయిద్దాం....అని అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్ ను ఉద్దేశించి జేసీ చ‌మ‌త్క‌రించారు. జేసీ సెటైర్ కు మ‌రో ఎంపీ క‌న‌క‌మేడ‌ల‌...అంతే సెటైరిక‌ల్ గా బ‌దులిచ్చారు. ఆయ‌నెందుకు...మొన్న దీక్ష చేస్తే...మొద‌టిరోజే రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆసుప‌త్రికి తీసుకెళ్లాల్సి వ‌చ్చింది....అని చ‌మ‌త్క‌రించారు. గల్లా.. మాగంటి.. రేణుక....రామ్మోహ‌న్....ఇత‌ర టీడీపీ ఎంపీలంతా ఆ గ‌దిలో ఎంతో `స‌ర‌దాగా ` ఉల్లాసంగా ....రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై స్పందించిన తీరుపై ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎంపీల తీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు.

ఎంతో బాధ్యత‌తో త‌మ‌ను ప‌రిపాలిస్తార‌ని ఆంధ్ర ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఎంపీలు ఇంత బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడ‌డం ఏమిట‌ని ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖకు రైల్వే జోన్ గురించి అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్ నిర్ల‌క్ష్యంగా మాట్లాడార‌ని.......జోన్ లేదు గీన్ లేదు అంటూ ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్యాఖ్యానించార‌ని మండిప‌డ్డారు. 5కేజీలు త‌గ్గాలి అంటే వారం రోజులు దీక్ష చేస్తే చాలు......అని మ‌రో ఎంపీ ముర‌ళీ మోహ‌న్ అంటార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మ‌నం ఎన్నుకున్న రాజ‌కీయ నాయ‌కుల‌కు క‌నీస బాధ్య‌త లేద‌ని ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని ప‌వన్ అన్నారు. డ‌బ్బులిచ్చేశాం....ఓట్లువేశారు.....ప్ర‌జ‌లు మ‌న‌ బానిస‌లు అనే ధోర‌ణిలో వారున్నార‌ని.....ఇటువంటి రాజ‌కీయ నాయ‌కుల‌ను యువ‌త ప్ర‌శ్నించాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఎక్క‌డో ఒక‌చోట ...ఎవ‌రో ఒక‌రు వారిని ఆప‌క‌పోతే.....వారిని నిలువ‌రించ‌క‌పోతే ...ఈ దోపిడీ - నిర్ల‌క్ష్య వైఖ‌రి నిరంత‌రం కొన‌సాగుతూనే ఉంటుందని ప‌వ‌న్ అన్నారు.