Begin typing your search above and press return to search.

నా ఒక్కడి వల్ల హోదా సాధ్యం కాదన్న పవన్

By:  Tupaki Desk   |   20 Aug 2016 11:35 AM GMT
నా ఒక్కడి వల్ల హోదా సాధ్యం కాదన్న పవన్
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలాకాలం తరువాత మీడియా ముందుకొచ్చారు. ఆయన రాకకోసం చాలామంది ఎదురుచూస్తున్నప్పటికీ ఆయన నుంచి గత మూణ్నెళ్లుగా ఆయన నుంచి రాజకీయ స్పందనలు లేవు. తాజాగా శనివారం ఆయన మాట్లాడినా ప్రత్యేక హోదా తేవడం తన ఒక్కడి వల్లే కాదని చెప్పడంతో అంతా ఉసూరుమన్నారు. ఇంతకుముందు ఏప్రిల్ 30వ తేదీన ప్రత్యేక హోదాపై ట్వీట్ చేసిన ఆయన ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించినా తన అభిప్రాయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఇది చాలా సున్నితమైన విషయమని.. ఆవేశంతో - అనాలోచితంగా మాట్లాడకూడదని - ఒక పరిష్కారం సూచించేలా ఉండాలని అన్నారు. ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఉండాలని తెలిపారు. ఎన్నికైన ఎంపీలు - ఎమ్మెల్యేలు ఉన్నారని.. ప్రతిపక్షం కూడా ఉందని, వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేయాలన్నారు.. ఇంతమంది ఎంపీలు - ఎమ్మెల్యేలు చేయలేనిది ఒక వ్యక్తిగా తనకు సాధ్యపడుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు.

కాంగ్రెస్ - బీజేపీ కలిసి పార్లమెంటులో హామీ ఇచ్చాయి కాబట్టి ఆ పార్టీలే అమలుచేయాలని పవన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం కచ్చితంగా చెప్పినప్పుడు ఆలోచిద్దామని పవన్ అన్నారు. ‘‘ఏదైనా చేయాలని నాకూ ఉంది.. కానీ, ఆలోచించి చేయాలి కదా’’ అని పవన్ అన్నారు. తనది ఘర్షణ వైఖరి కాదని... ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా కోసం పనిచేయాలని సూచించారు. కర్ణాటక మాజీ సీఎం - జేడీఎస్ కీలక నేత కుమారస్వామి తనను కలిసేందుకు వచ్చిన సందర్భంగా పవన్ మీడియా ముందుకు వచ్చారు. తనతో కుమారస్వామి భేటీ స్నేహపూర్వకమైనదే తప్ప రాజకీయ కారణాలేవీ లేవని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు కృష్ణా పుష్కరాలకు రావాలని ఏపీ ప్రభుత్వం తనను ఆహ్వానించిందని పవన్ వెల్లడించారు. దీంతో ఇంతకాలం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఆహ్వానం లేదన్నది అపబద్ధమని తేలింది. గోదావరికి పిలిచినట్టే కృష్ణా పుష్కరాలకు కూడా పవన్ కు ఆహ్వానం వెళ్లిందన్నమాట. ఇక తాజా సంచలనం సింధు గురించి కూడా పవన్ స్పందించారు. ఒలింపిక్సు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్సులో రజత పతకం సాధించిన పీవీ సింధుకు పవన్ అభినందనలు తెలిపారు.

మరోవైపు కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ 'జాగ్వార్‌' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలోనే కుమారస్వామి పవన్ ను కలిసేందుకు వచ్చారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని ఇద్దరూ మీడియాకు చెప్పడం విశేషం.