Begin typing your search above and press return to search.

పీకే రిక్వెస్ట్..కార్మికులను కేసీఆర్ కరుణిస్తారా?

By:  Tupaki Desk   |   21 Nov 2019 1:30 AM GMT
పీకే రిక్వెస్ట్..కార్మికులను కేసీఆర్ కరుణిస్తారా?
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ముగింపు దశకు వచ్చేసింది. కార్మికుల డిమాండ్లకు ససేమిరా అన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలి కఠిన వైఖరితో ముందుకు సాగారు. నెలకు పైగా సాగిన సమ్మె వివాదం హైకోర్టు గడప తొక్కినా... కేసీఆర్ మెత్తబడలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వైఖరి ముందు దాదాపుగా తలొంచేసిన ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించేందుకు సిద్ధమైపోయారు. అయితే సమ్మె విరమిస్తే.. తమను కేసీఆర్ ఎక్కడ ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తారోనన్న భయం కార్మికులను వెంటాడుతోంది. ఇలాంటి కీలక తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. సమ్మె విరమణకు సిద్ధమైన కార్మికుల పట్ల సానుభూతి చూపాలని - కార్మికులను విధుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని తన విజ్ఝప్తిలో కేసీఆర్ ను పవన్ కోరారు.

ఈ మేరకు సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి ప్రకటన చేసిన మరుక్షణమే పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ కు రిక్వెస్ట్ పంపారు. సదరు రిక్వెస్ట్ ట్వీట్ లో పవన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కేసీఆర్ గారికి విజ్ఝప్తి చేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులూ కోరారు. నలభై రోజులకి పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను. తద్వారా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాబులోకి వస్తుంది. ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ పవన్ పేర్కొన్నారు.

సమ్మె జరుగుతున్నంత కాలం దీనిపై పవన్ పెద్దగా స్పందించిన దాఖలా కనిపించలేదన్న విషయం తెలిసిందే. సమ్మెపై తెలంగాణ సర్కారు కఠిన వైఖరితో ముందుకు సాగుతున్న దరిమిలా... ఏ మాట అంటే... ఏం జరుగుతుందోనన్న భావనతోనే పవన్ నిన్నటిదాకా దీనిపై అంతగా స్పందించలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే సమ్మెపై కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరించడం, ఆయన వైఖరిని హైకోర్టు కూడా తప్పుబట్టకపోవడంతో కార్మికులు సమ్మె విరమణ బాట పట్టక తప్పలేదు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన లేకుండా విధులకు హాజరైతే... తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో కార్మికులు ఉన్న నేపథ్యంలో పవన్ వారి పక్షాన కేసీఆర్ కు ఓ వినతిని పంపడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి పీకే విజ్ఝప్తికి కేసీఆర్ ఏమంటారా? కార్మికులకు భరోసా లభిస్తుందో? లేదో? చూడాలి.