Begin typing your search above and press return to search.

శ్రీ‌నిరాజుపై షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన ప‌వ‌న్!

By:  Tupaki Desk   |   23 April 2018 1:03 PM GMT
శ్రీ‌నిరాజుపై షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన ప‌వ‌న్!
X
కొన్ని మీడియా చానెళ్ల‌పై - వాటి అధిప‌తులు - సీఈవోలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్ట‌ర్ వార్ పెను దుమారం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌ను - త‌న త‌ల్లిని అవ‌మానించారంటూ ఆ చానెళ్ల‌పై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసిన ప‌వ‌న్....వరుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు వారి గురించి దాదాపుగా అంద‌రికీ తెలిసిన విష‌యాల‌ను - ఫొటోల‌ను - వీడియోల‌ను పోస్ట్ చేసిన ప‌వ‌న్....తాజాగా షాకింగ్ ట్వీట్ ఒక‌టి చేశారు. టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న ఆ చానెళ్లు త‌న‌పై విషం క‌క్కుతున్నాయ‌ని - 6 నెల‌లుగా త‌న‌ను టార్గెట్ చేసి భావోద్వేగపు అత్యాచారం చేస్తున్నాయ‌ని మండిపడుతోన్న ప‌వ‌న్....తాజాగా శ్రీ‌నిరాజుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర స‌మాచారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇది ఎవ‌రు? అంటూ.....2009-10 స‌మయంలో టీడీపీకి శ్రీ‌నిరాజు రూ.కోటి పార్టీ ఫండ్ గా డొనేట్ చేసినట్లు ఆధారాల‌ను ప‌వ‌న్ ట్వీట్ చేశారు. అందులో చ‌ల‌ప‌తి శ్రీ‌నివాస‌రాజు(శ్రీ‌నిరాజు) ఇంటి అడ్ర‌స్ - పాన్ నంబరు వంటి వివ‌రాల‌ను ప‌వ‌న్ హైలైట్ చేశారు. అంతేకాకుండా, ఆ విరాళం ఇచ్చిన డేటాలో ఉన్న పాన్ నంబ‌ర్ ...శ్రీ‌నిరాజు పాన్ నంబ‌ర్ ఒక‌టేన‌ని ధృవీక‌రిస్తూ మ‌రో ట్వీట్ చేశారు. తాజాగా, అందులో పాన్ నెంబ‌రు శ్రీ‌నిరాజుదో కాదో అని అనుమానం ఉన్న వారికోసం ఆయ‌న పాన్ నెంబ‌రును మ‌రోసారి ప‌వ‌న్ ధృవీక‌రించారు. శ్రీ‌నిరాజు పాన్ నంబ‌ర్ ఉన్న ``TIN e-Tax Payment `` ర‌శీదును ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ప‌వ‌న్ తాజా ట్వీట్ల‌తో టీడీపీకి - శ్రీ‌నిరాజుకు బ‌ల‌మైన సంబంధం ఉంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేశారు.

అంత‌కుముందు ప‌వ‌న్ మ‌రిన్ని ఆస‌క్తిక‌ర ట్వీట్లు చేశారు. మ‌న‌ల్ని తిట్టే టీవీలు - పేపర్లను ఎందుకు చూడాలని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. 'ఆ మూడు టీవీ ఛానెళ్లను నడుపుతున్నదెవరు?... ఈ భావోద్వేగపు అత్యాచారాల (ఎమోషనల్ రేప్) నుంచి కాపాడేందుకు ఎలాంటి నిర్భయ చట్టం అవసరం?' అని ప‌వ‌న్ ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ త‌న‌కు శ్రీ‌నిరాజు లాయ‌ర్ పంపిన లీగ‌ల్ నోటీసుకు బ‌దులిస్తూ మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల నేపథ్యంలో పవన్ కు టీవీ9 శ్రీనిరాజు లాయర్ నోటీసులు పంపిన సంగ‌తి తెలిసిందే. ఆ నోటీసుల‌పై పవన్ ఆస‌క్తిక‌ర బ‌దులిచ్చారు. త‌న‌కు నోటీసులు పంపిన శ్రీనిరాజు లాయర్ సునీల్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ సుదీర్ఘ లేఖను ప‌వ‌న్ పోస్ట్ చేశారు. అంతేకాదు, త‌న‌కు శ్రీ‌నిరాజు లాయ‌ర్ నోటీసులు పంప‌డం ఏమిటో అర్థం కావ‌డం లేదంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబును ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ``ఏపీ సీఎం శ్రీ చంద్ర‌బాబు నాయుడు గారిని నేను ప్ర‌శ్నిస్తున్నా.....త‌న లాయ‌ర్ ద్వారా టీవీ9 శ్రీ‌నిరాజు నాకు లీగ‌ల్ నోటీసులు పంప‌డం వెనుక లాజిక్ ఏమిటో నాకు అర్థం కావ‌డం లేదు...``అంటూ ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

టీవీ9 శ్రీ‌నిరాజు లాయ‌ర్ కు నా జ‌వాబు....

'ఒక వ్యక్తి త‌న ట్విట్టర్ ఖాతాలో చేసే ట్వీట్లు ఆ వ్యక్తి అభిప్రాయాలను - భావాల‌ను తెలియ‌జేస్తాయి. మీ క్లయింట్(శ్రీ‌నిరాజు)ను ఉద్దేశించి నేను చేయ‌ని ట్వీట్ కు మీ ద్వారా ఆయ‌న ఎందుకు స్పందించారో అర్థం కావ‌డం లేదు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. నేను మీ క్లయింట్ పై ఎటువంటి నిందలు మోప‌లేదు. బ‌హుశా ఆయనే అలా ఊహించుకుంటున్నట్టున్నారు. లేదంటే తాను తప్పు చేశానన్న భావనలో ఉన్నారేమో.

2018 ఏప్రిల్ 20న చేసిన ట్వీట్ లో... మీరు చెప్పినట్టు పరోక్ష నిందలు - ఆరోపణలు - నిరాధార వ్యాఖ్యలు లేవు. నా ఫీలింగ్స్ ను నా ట్విట్ట‌ర్ ఖాతాలో చెప్పాను. చట్ట ప్రకారం ఇది ఎవరిపైనా దాడి చేసినట్టు ఎంత మాత్రం కాదు. మీరు నోటీసులో పేర్కొన్న‌ట్లు అది ఆయ‌న‌పై దాడి కాదు.

నాకు ఎన్ని అవ‌రోధాలు సృష్టించినా .... నా లక్ష్యం కోసం పోరాడ‌తాను. సమాజంలోని అన్ని వర్గాలు ఎదగడానికి త‌ప్ప‌క కృషి చేస్తాను. ఈ లేఖ‌లో నేను చెప్పిన వివరాలను నిశితంగా ప‌రిశీలించి....వాటిని దృష్టిలో పెట్టుకొని....మీ క్లయింట్ కు సరైన సలహాలు ఇస్తారని భావిస్తున్నాను'