Begin typing your search above and press return to search.

పవన్ 'మతం - కులం' స్ట్రాటజీ..జనసేనను ఏం చేయనుంది ?

By:  Tupaki Desk   |   3 Dec 2019 5:30 PM GMT
పవన్ మతం - కులం స్ట్రాటజీ..జనసేనను ఏం చేయనుంది ?
X
జనసేనాని పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం.. నవ్యాంధ్రప్రదేశ్ ను కులం - మతం కార్డులతో రాజకీయాలు నడిచే ఉత్తర ప్రదేశ్ లా మారుస్తుందా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అందరిలాగే తాను టార్గెట్ చేసిన ప్రత్యర్థులపై సాదారణంగానే విరుచుకుపడిన పవన్... ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక... కేవలం జగన్ ను టార్గెట్ గా చేసుకుని కులం, మతం అంటూ నానా యాగీ చేస్తున్న వైనం తెలిసిందే. ఈ తరహా నయా వ్యూహం పవన్ కు లాభిస్తుందా? లేదంటే ఏకంగా గట్టి దెబ్బే కొడుతుందా? అన్న దిశగానూ విశ్లేషణలు మొదలయ్యాయి. కేవలం పవన్ నోట నుంచి మాత్రమే వస్తున్న ఈ కులం - మతం కామెంట్లు... అసలు జనసేన వ్యూహమా? లేదంటే.. ఇతర కీలక పార్టీలు ఆయనను వెనకుండి తమ వ్యూహం మేరకు నడిపిస్తున్నాయా? అన్న దిశగానూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

యూపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా... అక్కడ కేవలం కులం - మతం కార్డులే గెలుపు ఓటములను శాసిస్తున్నాయి. హిందూత్వ భావజాలం బలంగా పనిచేసే ఆ రాష్ట్రంలో బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఇవే కార్డులతో రాజకీయాలు నడుపుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం ఇప్పటిదాకా ఈ తరహా రాజకీయాలు జరిగిన దాఖలా లేదు. ఆయా పార్టీల మేనిఫెస్టోలు - సంక్షేమ పథకాలు తదితరాల ఆధారంగా సాగుతున్న ఇక్కడి ఎన్నికల్లో... జనరంజక పాలన అందించే పార్టీలు - నేతలకు మాత్రమే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో సరికొత్త సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానంటూ గడచిన ఎన్నికల్లో జగన్ చెప్పిన మాటను నమ్మిన జనం... వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకే విజయావకాశాలు ఉన్నాయని, అసలు ఆ పార్టీని ఢీకొట్టడం టీడీపీకి కాదు కదా... ఇక ఏ ఒక్క పార్టీకి కూడా సాధ్యం కాదన్న రీతిలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో నేరుగా జగన్ నే టార్గెట్ చేస్తూ సాగుతున్న పవన్... ఇప్పుడు సరికొత్తగా జగన్ కులం ఏమిటి? మతం ఏమిటి? అంటూ తనదైన శైలి కామెంట్లు చేస్తూ పెను కలకలమే రేపుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్ క్రిస్టియన్ గా మారిన తర్వాత కూడా రెడ్డి కులాన్ని అంటిపెట్టుకున్నారని - మతం మారినప్పుడు కులాన్ని కూడా మార్చుకోవాల్సిందేనంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. తన మతం మానవత్వం - కులం మాట నిలబెట్టుకోవడమంటూ జగన్ చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా పవన్ తన కులం - మతం వ్యూహాన్ని మరింతగా పెంచేశారనే చెప్పాలి. ఏపీ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న జగన్ కు ఓ కులాన్ని దూరం చేయాలన్న వ్యూహంతోనే పవన్ ఈ తరహా ప్లాన్ ను అమలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యూహంతో పవన్ కు కూడా కొన్ని కులాలు - మతాలు దూరం కాక తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ ను ఏకాకిని చేయాలన్న పవన్ వ్యూహం ఫలిస్తుందో... లేదంటే అదే వ్యూహం పవన్ కు బూమరాంగ్ అవుతుందో చూడాలి.