Begin typing your search above and press return to search.

పవన్ ఇప్పుడెక్కడున్నారు? ఏం చేస్తున్నారు..?

By:  Tupaki Desk   |   8 Sep 2016 11:48 AM GMT
పవన్ ఇప్పుడెక్కడున్నారు? ఏం చేస్తున్నారు..?
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన అన్యాయం అందరికి తెలిసిందే. విభజన నష్టాన్ని‘ప్రత్యేక హోదా’తో ఎంతోకొంత భర్తీ చేస్తామన్న నాటి ప్రధాని మన్మోహన్ మాటను తూచ్ అనేసిన మోడీ సర్కారు.. బుధవారం రాత్రి (సెప్టెంబరు 7) కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాత్రివేళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే లేదన్న విషయాన్ని తేల్చేశారు. జైట్లీ ప్రకటనకు కేవలం రెండు రోజులు వ్యవధిలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ జరగనున్నది.

ఈ సభను దాదాపు రెండు వారాల ముందే పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన తిరుపతి సభలోనే కాకినాడ సభ గురించి చెప్పటమే కాదు.. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాన్ని మూడు అంచెల్లో చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా కాకినాడలో భారీ బహిరంగ సభను పవన్ ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం ఒక రోజు ముందే కాకినాడకు చేరుకున్న ఆయన సభ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

కాకినాడలోని భావనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్.. తర్వాత తాను బస చేసిన చోట ఉండిపోయారు. తిరుపతి సభకు ముందు తిరుమలలో శ్రీవారి దర్శనం ఒకటికి రెండు సార్లు చేసుకున్న పవన్.. కాకినాడలో కూడా పూజలు చేయటం గమనార్హం. పెద్దగా బయటకు రాని పవన్.. పలువురు నేతలతో మంతనాలు నడుపుతున్నారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్న పవన్.. తన సభకు ముందే వచ్చేయటంతో కాకినాడను పవన్ మేనియా కమ్మేసినట్లైంది.