Begin typing your search above and press return to search.

పార్టీని విస్తరించడానికి ప్లాన్ తో పవన్ రెడీ

By:  Tupaki Desk   |   29 Jun 2019 12:30 PM GMT
పార్టీని విస్తరించడానికి ప్లాన్ తో పవన్ రెడీ
X
గత కొన్ని రోజులు ఫలితాలపై కార్యకర్తల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ పరిస్థితి గురించి తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి కొత్త రూపు ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీ పటిష్టం కావాలంటే... ఇంకా ఎంతో చేయాల్సి ఉందని ఆయన నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల నాటికి పార్టీ ప్రజల్లోకి వెళ్లలేదని పవన్ గ్రహించారు. అందుకే పార్టీని మూలమూలలకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం జులై మొదటి వారంలో అమెరికా పర్యటన (తానా సభలు) ముగించుకుని వచ్చాక పార్టీ నిర్మాణం ప్రారంభిస్తారని తెలుస్తోంది.

ముఖ్యంగా ముందు పార్టీకి అన్ని స్థాయిల్లో నాయకత్వం ఇవ్వాలని పవన్ నిర్ణయించారట. బూత్ స్థాయి నుంచి పార్టీని బలపరచగల ప్రజాదరణ ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ఒక కీలక నిర్ణయం కాగా... కొత్త యువ రక్తాన్ని రాజకీయాల్లోకి ఆహ్వానించాలన్నది మరో కీలక నిర్ణయం అని తెలుస్తోంది. 2014లో నేను ఒకడిని, 2019 లో మీరు నాతో నడిచారు. 2024కి పార్టీ పరిధిని పెంచి విస్తరిద్దాం... ప్రతి నోటా జనసేన వినిపించేలా పార్టీని జనంలోకి తీసుకెళ్దాం అని పవన్ నేతలతో అన్నట్టు తెలుస్తోంది. కొత్త చేరికలపై కొందరు పెదవి విరిచినా పవన్ మాత్రం డిసైడైపోయినట్లు తెలిసింది. ఈ చేరికలు ఇటీవలే పవన్ తో చర్చలు జరిపిన వంగవీటి రంగాతోనే మొదలుకానున్నాయి.

యువతను పార్టీలోకి తీసుకునే విషయంలో నందమూరి తారక రామారావుని అనుసరించేలా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే దీనిని మొదలుపెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంచి పట్టుదల ఉన్న యువతను ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని పవన్ ఆలోచన. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి సమూలంగా పార్టీని పునర్నిర్మించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక గత ఓటమి నుంచి తేరుకుని స్థానిక ఎన్నికలకు కేడర్‌ను, నేతలను సిద్ధం చేసేందుకు పవన్‌ స్వయంగా రంగంలోకి దిగనున్నారు.

దీనికోసం జూలై రెండోవారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తూ నియోజకవర్గ సమీక్షలు జరుపుతారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ కోసం పనిచేసిన వారి నుంచి స్వయంగా సలహాలు సూచనలు స్వీకరిస్తారు పవన్. అలాగే ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. ఇది తన సొంత నియోజకవర్గాల నుంచే మొదలుకానుంది.