Begin typing your search above and press return to search.

రాపాక అరెస్టు - జనసేనాని స్పందన

By:  Tupaki Desk   |   13 Aug 2019 11:59 AM GMT
రాపాక అరెస్టు - జనసేనాని స్పందన
X
నిన్నటి నుంచి తీవ్ర చర్చనీయాంశమైన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. చిన్నపాటి స్టేషన్ బెయిలుతో పోయే విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారు అన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చెప్పాలంటే...

''ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ విషయంలో అత్యుత్సాహం చూపారు. ప్రజలకు మద్దతుగా ఆయన స్టేషనుకు వెళ్తే చిన్న గొడవ జరిగింది. చిన్న స్టేషను బెయిలుతో పోయే సంఘటనపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టి ఆయనను అరెస్టు చేశారు. దీనిపై నిన్నటి నుంచి నేను సమీక్షిస్తున్నాను. నాయకులతో మాట్లాడుతున్నాను. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కూడా చెప్పాను. నేను ఆరాతీస్తే ప్రజలకు మద్దతుగా వెళ్లారని చెప్పారు. అరెస్టయిన వారిలో ఒకరికి బాలేకపోవడం వల్ల వెళ్లారు అని నాకు చెప్పారు. చిన్న సంఘటనను పెద్ద ఇష్యూ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ తో అరెస్టు చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జర్నలిస్టు మీద దాడి చేస్తే అదిపెద్ద ఇష్యూ కాదన్నట్టు ప్రవర్తించారు. చిన్న కేసు నమోదు చేసి వెంటనే వదిలేశారు. కానీ చాలా చిన్న విషయంలో జనసేన ఎమ్మెల్యేపై పెద్ద కేసు పెట్టారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకొచ్చారు. జనసేన కార్యకర్తలు, నాయకులకు చెబుతున్నాను. సంయమనం పాటించండి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకండి. ప్రభుత్వం, పోలీసులు రాపాక గారి విషయాన్ని వాస్తవాలు తెలుసుకుని డీల్ చేయాలి. ఇది ఇంకా పెద్దదైతే నేను రాజోలు వస్తాను. రాపాక వరప్రసాద్ కు మద్దతుగా నిలబడతాను'' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు అధికారికంగా ఒక వీడియోను జనసేన సోషల్ మీడియాలో విడుదల చేశారు.