Begin typing your search above and press return to search.

అభిమాని మ‌ర‌ణంపై ప‌వ‌న్ దిగ్భ్రాంతి

By:  Tupaki Desk   |   10 Sep 2016 6:57 AM GMT
అభిమాని మ‌ర‌ణంపై ప‌వ‌న్ దిగ్భ్రాంతి
X
కాకినాడ స‌భ‌లో ప్ర‌మాదవ‌శాత్తూ ప్రాణాలు కోల్పోయిన నందికోళ్ల వెంక‌ట‌ర‌మ‌ణ మ‌ర‌ణంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. అత‌డి కుటుంబానికి త‌న ప్ర‌గాఢ సంతాపం తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌న‌ని క‌ల‌చివేస్తాయ‌నీ, జీవితాంతం ఈ బాధ త‌న‌ని వెంటాడుతూ ఉంటుంద‌ని ప‌వ‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. చేతికి అంది వ‌చ్చిన కొడుకు మ‌ర‌ణిస్తే ఆ తండ్రికి క‌లిగే గ‌ర్భ‌శోకం - ఆ కుటుంబ స‌భ్యులు ప‌డే ఆవేద‌న‌ అర్థం చేసుకోగ‌ల‌న‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ఆసుప‌త్రికి వెళ్లి వారి కుటుంబ స‌భ్యుల‌ను స్వ‌యంగా క‌లుసుకుందాం అనుకున్నాగానీ, భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా వెళ్ల‌డం కుద‌ర‌లేద‌ని ప‌వ‌న్ చెప్పారు. వెంక‌ట ర‌మ‌ణ ఆత్మ‌కు శాంతి క‌లగాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు.

వెంక‌ట ర‌మ‌ణ వ‌య‌సు 22. కాజులూరు మండ‌లం కుయ్యేరు అత‌డి సొంతూరు. ఈ కుర్రాడిది నిరుపేద కుటుంబం. అత‌డికి త‌ల్లి - తండ్రి - సోద‌రి - త‌మ్ముడు ఉన్నారు. సోద‌రి మూగ‌ది! వెంక‌ట ర‌మ‌ణ‌కు పెయింటింగ్ ప‌ని వ‌చ్చు. కుటుంబం అంతా కూలి డ‌బ్బుల మీద ఆధార‌ప‌డి బుతుకీడ్చుతూ రోజులు నెట్టుకొస్తున్నారు. తండ్రి త‌రువాత కుటుంబ బాధ్య‌త‌ల్నీ తానై మోస్తున్నాడు ర‌మ‌ణ‌. పెయింటింగ్స్ వేసుకుంటూ ఎంతోకొంత సంపాదిస్తూ కుటుంబ అవ‌స‌రాలు తీరుస్తూ ఉంటాడు.

ర‌మ‌ణ చిన్న‌త‌నం నుంచే ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమాని. ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచీ ప‌వ‌ర్ స్టార్ సినిమాలు బాగా చూస్తున్నాడు. దాంతో ప‌వ‌న్ పెయింటింగ్స్ చాలాబాగా వేస్తాడు. ప‌వ‌ర్ స్టార్ పార్టీ పెట్టాక జ‌న‌సేన‌కు సంబంధించి జెండాలూ బ్యాన‌ర్లూ వేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ప‌వ‌న్ క‌ల్యాణ్ బొమ్మ ఉన్న టీష‌ర్లులు వేసుకుంటూ ఊరిలో తిరుగుతూ ఉంటాడ‌ట‌. ప‌వ‌నిజం ష‌ర్టులు స్వ‌యంగా డిజైన్ చేసుకునేవాడ‌ట‌. కాకినాడ‌లో సీమాంధ్రుల ఆత్మ‌గౌర‌వ స‌భ ఉంద‌ని తెలిసి, కొన్ని జెండాలూ బ్యాన‌ర్లూ త‌యారు చేశాడు. అభిమానుల‌కు కొన్ని జెండాలు ఇచ్చి తానుకూడా జెండాలు పట్టుకుంటూ ప‌వ‌ర్ స్టార్‌ కి జై అంటూ వెళ్లాడు. అభిమాన హీరోను క‌ళ్లారా చూసుకున్న కాసేప‌టికే ప్రాణాలు కోల్పోయాడు. జీవ‌నాధార‌మైన వెంక‌ట ర‌మ‌ణ మర‌ణంతో కుటుంబం ఇప్పుడు దిక్కులేనిది అయిపోయింది. కుటుంబ స‌భ్యులంతా సోక సంద్రంలో ఉన్నారు. మాకు దిక్కెవ‌రు అని దీనంగా ఎదురుచూస్తున్నారు!