Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ నోటా!... బాబు మాటే!

By:  Tupaki Desk   |   12 May 2019 4:36 AM GMT
ప‌వ‌న్ నోటా!... బాబు మాటే!
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హోరాహోరీ ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన పేరిట రాజ‌కీయ పార్టీని పెట్టేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ- బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చారు. అయితే 2019 ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ.. టీడీపీతో కొన‌సాగుతున్న బంధాన్ని ప‌వ‌న్ అర్ధాంత‌రంగా తెంచేసుకున్నారు. టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ ల అవినీతిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో టీడీపీపై ప‌వ‌న్ విరుచుకుప‌డ‌టం ఖాయ‌మేన‌ని అంతా అనుకున్నారు. అయితే ఈసారి కూడా ఏమైందో తెలియ‌దు గానీ... ప‌వ‌న్ నోట టీడీపీపై ఒక్క‌టంటే ఒక్క విమ‌ర్శ కూడా వినిపించ‌లేదు. దీంతో టీడీపీతో జ‌న‌సేన లోపాయికారీ పొత్తు కుదిరింద‌న్న వాద‌న‌లు వినిపించాయి.

అయితే ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చే అంశాలు చాలానే వెలుగు చూసినా... అంతా ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న సమ‌యంలో మ‌రో ప‌క్కా ఆధారం దొరికేసింద‌నే చెప్పాలి. ఎన్నిక‌ల్లో ఎలాగూ ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భ‌యంతో సాకులు వెతుక్కుంటున్న చంద్ర‌బాబు... ఈవీఎంల‌పై త‌న‌దైన పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే క‌దా. త‌న‌తో క‌లిసి వ‌చ్చే చిన్నా చిత‌క పార్టీల‌తో ఆయ‌న ఇప్ప‌టికే ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి భంగ‌ప‌డ్డారు క‌దా. ఇవేవీ అంత‌గా ప‌ట్ట‌ని ప‌వ‌న్ పోలింగ్ ముగియ‌గానే ఫుల్ రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తాజాగా నంద్యాల ఎంపీ అభ్య‌ర్థి ఎస్పీవై రెడ్డి చ‌నిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు క‌ర్నూలు జిల్లాకు వ‌చ్చిన ప‌వ‌న్‌... బాబుతో త‌న దోస్తీని బ‌య‌ట‌పెట్టుకున్నారు. కౌంటింగ్ లో వీవీ ప్యాట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా లెక్కించాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ మాట‌తో తాను కూడా చంద్ర‌బాబు గూటి పక్షినేన‌ని ప‌వ‌న్ చెప్పేసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

బాబుతో త‌న దోస్తానాను ఇలా బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్‌... త‌న విజ‌యంపైనా, ఎన్నిక‌ల ఫ‌లితాల‌పైనా చాలా అంశాలే మాట్లాడారు. ఈ నెల 23న ప్ర‌జ‌లు ఎవ‌రిని సీఎంగా కోరుకుంటున్నార‌న్న విష‌యం తేలిపోతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక విశాఖ జిల్లా గాజువాక‌ - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రాల్లో పోటీ చేశారు క‌దా... అక్క‌డ అస‌లు మీరు గెలుస్తున్నారా? గెలిస్తే ఎంత‌మేర మెజారిటీ వ‌స్తుంద‌న్న ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆయ‌న ఈ నెల 23న తేలుతుంద‌ని చెప్పేశారు. పోలింగ్ స‌ర‌ళి ఎలా ఉంద‌న్న విష‌యం కూడా 23న‌నే తేలుతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అప్ప‌టిదాకా ఎవ‌రు ఏం చెప్పినా కూడా అవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలేన‌ని కూడా ప‌వ‌న్ చెప్పారు. మొత్తంగా బాబుతో త‌న దోస్తానాను బ‌య‌ట‌పెట్టుకునేలా ఏకైక కొత్త వ్యాఖ్య చేసిన ప‌వ‌న్‌... మిగిలిన అన్ని అంశాల‌కు మే 23అనే స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.