Begin typing your search above and press return to search.

షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్న పవన్

By:  Tupaki Desk   |   8 Feb 2020 7:30 AM GMT
షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్న పవన్
X
రాజకీయ పార్టీల అధినేతలు చెప్పే మాటలకు.. చేసే పనులకు సంబంధం ఉండదు. ఏదైనా సమస్యతో పార్టీ అగ్రనేతల్ని కలిసి.. వినతిపత్రాన్ని ఇస్తే.. పరిశీలిస్తామని చెప్పటం.. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే పోరాడతానని చెప్పటం తెలిసిందే. అయితే.. ఇలా అన్నప్పుడు ఒక వర్గానికి సంబంధించిన సమస్యలపై స్పందించటం మామూలే. ఇందుకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఒకరి సమస్య మీద ఆయన బయటకు రావటమే కాదు.. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది.

కర్నూలుకు చెందిన ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురై.. ఫ్యాన్ కు ఉరివేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ పవన్ రోడ్డు మీదకు వస్తున్నారు. 2017 ఆగస్టులో చోటు చేసుకున్న ఈ ఘటన కర్నూలు జిల్లాలో సంచలనంగా మారినా.. మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఈ అంశం మీద పెద్ద చర్చే జరిగింది.

కర్నూలులోని టీడీపీ నేత వి. జనార్దన్ రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డిస్కూల్లో చదివే పద్నాలుగేళ్ల పాప.. ఆ స్కూల్ అధినేత కుమారులు హర్షవర్దన్ రెడ్డి.. దివాకర్ రెడ్డిలు అత్యాచారం చేసి చంపారన్న ఆరోపణలు.. బాలిక తల్లిదండ్రులు చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం.. మరే పిల్లలకు.. తల్లిదండ్రులకు జరగకూడదన్న ఉద్దేశంతో వారు పోరాడుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ ను.. జనసేన అధినేత పవన్ ను కలిశారు.

కారణం ఏమైనా కానీ.. ఈ విషయంలో బాధిత కుటుంబానికి సాంత్వన లభించలేదు. అనుమానితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటివేళ.. అనూహ్యంగా ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ నెల 12న కర్నూలులో సదరు మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఉదంతంతో బాధితులకు న్యాయం చేయాలన్న అంశంపై మహా ర్యాలీని చేపట్టాలని పవన్ నిర్ణయించారు.

ఉరి వేసుకున్న బాలికపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు ధ్రువీకరించారు. అయితే.. తమ కుమార్తె ను లైంగిక హింసకు గురి చేయటమే కాదు.. తర్వాత చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్నది ఆ చిన్నారి తల్లిదండ్రుల వాదన. అంతేకాదు..ఈ ఉదంతంపై కలెక్టర్ నియమించిన కమిటీ కూడా లైంగికదాడి జరిగిన తర్వాత హత్య జరిగినట్లు గా ధ్రువీకరించినట్లు గా పాప కుటుంబీకులు చెబుతున్నారు. దగ్గర దగ్గర రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఉదంతం పై పవన్ స్పందించటం.. త్వరలో రోడ్డు మీదకు వచ్చి పోరాడాలని డిసైడ్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ పోరాటం నేపథ్యం లో.. బాధితురాలి కుటుంబానికి అంతో ఇంతో ఊరట లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.