Begin typing your search above and press return to search.

పవన్‌ ప్రెస్‌మీట్లో ఏముంది?

By:  Tupaki Desk   |   6 July 2015 4:59 PM GMT
పవన్‌ ప్రెస్‌మీట్లో ఏముంది?
X
ఎన్నెన్ని ప్రశ్నలు.. మరెన్ని సందేహాలు. మొత్తాన్ని.. ఒక్క ప్రెస్‌మీట్‌తో తేల్చేయటమే కాదు.. తాను చెప్పాల్సిన వాదనను సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేశారు. ఉత్తంగ ప్రవాహంగా విరుచుకుపడే కన్నా.. గల గల పారే సెలయేరులా మాటలతో సందడి చేశారు. పదునైన విమర్శలతో చురుకు పుట్టించటమే కాదు.. తనకు ఆంధ్రా.. తెలంగాణ కాదు.. తెలుగోళ్లు ముఖ్యమన్న విషయాన్ని తేల్చేశారు.

ప్రాంతీయ భావంతో కుతకుతలాడిపోతూ.. అవకాశం చిక్కినప్పుడు.. అవసరమైనప్పుడు ప్రాంతీయ విద్వేషాల విషం కక్కే రాజకీయ నేతలకు తాను పూర్తి భిన్నమని తేల్చి చెప్పటమే కాదు.. ఎవరికి ఎన్ని చురకలు వేయాలో అన్ని చురకలు వేసి.. తన మీద మరక పడనీయకుండా తెలివిగా తన దారిన తాను పోయారు.

ప్రత్యక్ష రాజకీయాలకు తనకు టైం లేదన్న విషయాన్ని చెప్పేసిన పవన్‌.. రెగ్యులర్‌ రాజకీయాల్ని తాను నిత్యం క్షుణ్ణంగా పట్టించుకున్నాన్న విషయాన్ని పదే పదే నొక్కి వక్కాణించారు. తన ప్రసంగంలో ఆ విషయాన్ని పలు ఉదాహరణలతో చెప్పేశారు కూడా. వెబ్‌ ప్రపంచంలో కాస్తంత హడావుడి చేసినా.. ప్రింట్‌.. ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్దగా సందడి చేయని వీహెచ్‌ మాటల్ని సైతం ప్రస్తావించి.. ఆయన మాట్లాడిన మాటలు కూడా తాను చూశానని చెప్పటం ద్వారా.. అన్నీ చూస్తున్నాను సుమా అన్న విషయాన్ని చెప్పేశారు.

బవిరి గడ్డంతో.. ముందుకు పడుతున్న జుట్టును పదే.. పదే వెనక్కి తోసుకుంటూ దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు.. తాను చెప్పాలనుకున్న విషయాల్ని వివరంగా చెప్పేసిన ఆయన.. తాను అసలు సిసలు రాజకీయనాయకుడ్ని ఎంత మాత్రం కాదని.. భావోద్వేగం నిండిన భాద్యత కలిగిన ఒక సగటు పౌరుడినన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. హరీశ్‌రావుకు పంచ్‌లు వేసే సమయంలో.. ఆయనకు ఎంతో ఇష్టమైన బత్స సత్యనారాయణ కులం ప్రస్తావన తీసుకొచ్చిన పవన్‌ మాటకు గంభీరంగా సాగుతున్న ప్రెస్‌మీట్‌లో నవ్వులు విరబూయగానే.. నవ్వేసిన ఆయన.. తనలోని స్వచ్ఛమైన అమాయకత్వాన్ని ప్రదర్శించారే కానీ.. నేనెంత పోటుగాడినన్నట్లుగా వ్యవహరించ లేదు.

తన ప్రెస్‌మీట్లో పదే పదే ప్రస్తావించిన బాధ్యత అన్న మాటను.. తన ప్రసంగంలో ఎక్కడా మిస్‌ కాకుండా.. ఎంతో బాధ్యతగా మాట్లాడిన పవన్‌.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు.. రెండు రాష్ట్ర సర్కారులకు అవసరమైన చురకల్ని వేసేశారు. మరి.. తాజాగా పవన్‌ మాటలపై రెండు రాష్ట్రాలకు చెందిన అధికార.. విపక్ష సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

3