Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ప్రెస్‌మీట్లో ఏం చెప్తాడు?

By:  Tupaki Desk   |   31 Jan 2016 7:47 PM GMT
ప‌వ‌న్ ప్రెస్‌మీట్లో ఏం చెప్తాడు?
X
జ‌న‌సేన అధినేత - ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపుడూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు గర్జన స‌భ‌, అనంత‌రం జ‌రిగిన రైలు బోగీలు ద‌గ్దం, ఆస్తుల ధ్వంసంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తుని ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌న్నారు. కేరళలో సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నట్లు జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు స‌మాచారం ఇచ్చాయి.

ఇప్ప‌టికే తుని ఘ‌ట‌న‌పై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌హా ఇద్ద‌రు ఉప‌ముఖ్య‌మంత్రులు, మంత్రులు స్పందించారు. చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగంలో తుని ఘ‌ట‌న వెనుక ఎవ‌రున్నారో త‌న‌కు తెలుస‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కాపుల‌ను బీసీల జాబితాలో చేర్చేందుకు త‌మ‌కు అభ్యంత‌రాలు లేవ‌ని చెప్పారు. అయితే రాజ్యాంగ‌ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్న‌ట్లు వివ‌రించారు. ఉప‌ముఖ్య‌మంత్రులు స‌హా మంత్రులు ఏకంగా కాంగ్రెస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ హ‌స్తం ఉంద‌ని విమ‌ర్శ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రెస్‌మీట్‌పై ఆస‌క్తి నెల‌కొంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏపీసీఎం చంద్ర‌బాబుకు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ధ్య స‌ఖ్య‌త ఉంది. 2014 ఎన్నిక‌ల్లో విజ‌యానికి ప‌వ‌న్ కార‌ణ‌మ‌ని బాబు న‌మ్ముతుండ‌గా... బాబు తోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని ప‌వ‌న్ విశ్వ‌సిస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం భూమ‌లు విష‌యంలో ఒకింత పొరాపొచ్చాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత స‌మ‌స్య స‌మ‌సిపోయింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ చంద్ర‌బాబు మ‌నిషి అనే అభిప్రాయంలో సందేహం లేదు. మరోవైపు చూస్తే కాపు కులం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత కులం. కాపు నేత‌లు త‌మ జాతికి జ‌రుగుతున్న అన్యాయం కోసం పార్టీల‌కు అతీతంగా ఏక‌మై ఇపుడు గ‌ళం విప్పుతున్నారు. ఈ ప‌రిస్థితి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మారింది, ప్ర‌స్తుతం హింసాత్మ‌క రూపును సంత‌రించుకుంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ తాజా ప్రెస్‌మీట్లో ఏం చెప్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటు కాపుల కోటాను స‌మ‌ర్థిస్తారా? లేదా చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్లు చేస్తారా? లేదంటే పవ‌న్‌కు అత్యంత ఇష్ట‌మైన విధాన‌మైన‌...అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం అనే అజెండాను తెర‌మీద‌కు తెస్తారా అనేది హాట్ టాపిక్ అయింది.