Begin typing your search above and press return to search.
జనంలోకి పవన్!... త్వరలో జనసేన ప్లీనరీ!
By: Tupaki Desk | 23 Oct 2017 4:07 AM GMTప్రశ్నిస్తానంటూ పొలిటికల్ గా సొంత పార్టీ పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్వరలోనే జనంలోకి రానున్నారా? ఇప్పటి వరకు అడపా దడపా జనంలోకి వచ్చి, జనం సమస్యలపై తనదైన స్టైల్ లో స్పందించిన జనసేనాని త్వరలోనే పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయనున్నారా? ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీని సంస్థాగతంగా పూర్తి బలంగా నిర్మించేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. 2014లో పార్టీ పెట్టినా కేవలం ప్రకటన వరకే పరిమితమైన ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. కానీ, 2019 ఎన్నికల్లో జనసేనను పూర్తిస్థాయిలో ఎన్నికల్లో దింపాలని ఆయన డిసైడ్ అయ్యారు. దీనికిగాను గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకు వినూత్న పద్ధతిలో పరీక్షలు పెట్టి మరీ రిక్రూట్ మెంట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన పార్టీని భారీ స్థాయిలో బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే త్వరలోనే పార్టీ ప్లీనరీని నిర్వహించి.. రాబోయే రోజుల్లో జనసేన స్వరూపం - లక్ష్యాలు - ప్రజలకు చేయాల్సిన పనులు - ఎన్నికలే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నట్టు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ప్లీనరి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ? నిర్వహించాలనే అంశంపై పూర్తిగా క్లారిటీ రాకపోయినా.. పార్టీని బలోపేతం చేసే దిశగా మాత్రం పవన్ అడుగులు వేస్తున్నారని మాత్రం గట్టిగానే తెలియవచ్చింది. జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకూ జనసేన పార్టీ కోర్ కమిటీ భేటీ జరగలేదు.
ఇలాంటి తరుణంలో ఆదివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ముఖ్య ప్రతినిధులతో పవన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వచ్చే 6 నెలల్లో పార్టీ పరంగా నిర్వహించనున్న ముఖ్య కార్యక్రమాలపై వపన్ చర్చించారు. అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు పర్యటించాలనే అంశంపైనా జనసేన కోర్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. 2019లో ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ముందడుగు వేయాలనే దానిపైనా ఈ భేటీ చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయవాడలో నిర్వహించిన ప్లీనరీ మాదిరిగా జనసేన ప్లీనరీని ఓ రేంజ్ లో నిర్వహించాలని కూడా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు జనసేన నేతలు మీడియాకు లీకు చేశారు. మరోపక్క.. వచ్చే నెల నవంబరు నుంచి జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్న నేపథ్యంలో జనసేనను కూడా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరి పవన్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.