Begin typing your search above and press return to search.

ఈసారి మోడీని టార్గెట్ చేసిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   24 Sep 2017 5:28 AM GMT
ఈసారి మోడీని టార్గెట్ చేసిన ప‌వ‌న్‌
X
చిత్రంగా వ్య‌వ‌హ‌రించ‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బాగా అల‌వాటు. తాను ఎప్పుడేం కోరుకుంటారో అప్పుడది ఉండాల‌న్న‌ట్లుగా ఉంటుంది ప‌వ‌న్ తీరు చూస్తే. రాజ‌కీయాల్లోకి ఫుల్ టైం ఎప్పుడున్న విష‌యాన్ని ఈ మ‌ధ్య‌న త‌న‌కు తాను చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న చెప్పిన‌ట్లుగా అక్టోబ‌రుకు మ‌రో వారం వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంది.

ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డికి వెళ్లారో.. ఏం చేశారన్న విష‌యాన్ని పెద్ద‌గా బ‌య‌ట‌కు రానివ్వ‌ని ఆయ‌న‌.. తాజాగా మ‌రోసారి ఒక ఆస‌క్తిక‌ర అంశంపై మీడియా ముందుకు వ‌చ్చారు. తెలుగు రాష్ట్రాల్లో స‌మ‌స్య‌లు చాలా ఉన్నా.. జ‌న‌సేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీకి చెందిన వారు.. స‌మ‌స్య‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర‌కు రావ‌టం క‌నిపిస్తుంటుంది.

ఎక్క‌డెక్క‌డి వాళ్లో.. ఉన్న‌ట్లుండి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు వ‌చ్చేసి.. త‌మ స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టుకోవ‌టం క‌నిపిస్తుంది. మీడియాకు సైతం అందుబాటులోకి రాని ప‌వ‌న్.. ఎక్క‌డో మారుమూల ప్రాంతాల్లోని వారి స‌మ‌స్య‌ల మీద మాత్రం రియాక్ట్ కావ‌టం క‌నిపిస్తుంది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా.. ఒక వ‌ర్గం త‌ర్వాత మ‌రో వ‌ర్గం ప‌వ‌న్ ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునే తీరు చూస్తే.. ప‌లు సందేహాలు రావ‌టం ఖాయం.

ముందస్తుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ లో భాగంగా బాధితులు వ‌ప‌న్ ను క‌లుస్తారో.. లేదో తెలీదు కానీ.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న్ను క‌లిసిన బాధితుల జాబితా చూస్తే.. ఇలాంటిదేదో ఉంద‌న్న ఫీలింగ్ క‌ల‌గ‌టం ఖాయం. అదే స‌మ‌యంలో ఎప్ప‌టి నుంచో న‌లుగుతున్న సామాజిక అంశాల‌తో పాటు.. మ‌రికొన్ని ఎంపిక చేసిన అంశాల మీద మాట్లాడ‌టం.. ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇవ్వ‌టం.. వాటికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెంట‌నే స్పందించ‌టం లాంటివి చోటు చేసుకుంటుంటాయి.

తాను చేసిన డిమాండ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు రియాక్ట్ అయ్యాక‌.. థ్యాంక్స్ చెప్పేసి కామ్ అయ్యే ప‌వ‌న్.. మ‌ళ్లీ కొద్ది రోజుల వ‌ర‌కూ కామ్ గా ఉండ‌టం క‌నిపిస్తుంది.ఇప్ప‌టివ‌ర‌కూ ఈ త‌ర‌హా అల్టిమేటంలు ఏపీ రాష్ట్రానికే ప‌రిమితం కాగా.. ఈసారి కేంద్ర ప్ర‌భుత్వం మీద ఫోక‌స్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం లేని డ్రెడ్డింగ్ కార్పొరేష‌న్ (కేంద్రం నేతృత్వంలో న‌డుస్తుంటుంది) ఉద్యోగులు విశాఖ నుంచి హైద‌రాబాద్‌ కు వ‌చ్చి మ‌రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిశారు.

లాభాల్లో న‌డిచే డ్రెడ్డింగ్ కార్పొరేష‌న్‌ ను ప్రైవేటు వారికి అమ్మేయాల‌ని భావిస్తున్నార‌ని.. ఎలా అమ్మేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. లాభాల్లో న‌డుస్తున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్ని ప్రైవేటీక‌రిస్తే ఎలా అని ప్ర‌శ్నించిన ప‌వ‌న్‌.. ఇలా కేంద్రం సంస్థ‌ల్ని మూసేస్తుంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు రియాక్ట్ కావ‌టం లేద‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు.

త‌మిళ‌నాడులో ఇలా కేంద్ర సంస్థ‌ల్ని మూసే స‌మ‌యంలో అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వాలు అండ‌గా నిలిచాయ‌న్నారు. అదే తీరును డ్రెడ్డింగ్ కార్పొరేష‌న్ వ్య‌వ‌హారంలో అనుస‌రించాల్సిందిగా ప‌వ‌న్ కోర‌టం క‌నిపిస్తుంది. త‌మిళ‌నాడులో మాదిరి ఏపీలో ప్ర‌భుత్వం ఎందుకు చేయ‌టం లేద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ప‌వ‌న్‌.. అక్టోబ‌ర్‌.. న‌వంబ‌రుల‌లో విశాఖ‌కు వ‌చ్చి డ్రెడ్డింగ్ కార్పొరేష‌న్ సంద‌ర్శించ‌నున్న‌ట్లుగా చెప్పారు. ఇంత‌కాలం ఏపీ సీఎంగా ఇష్యూలు చూపించి అల్టిమేటం ఇచ్చిన ప‌వ‌న్‌.. తాజాగా మాత్రం ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అదేం చిత్ర‌మో కానీ.. ఎక్క‌డెక్క‌డి వారో వ‌చ్చి ప‌వ‌న్ ను క‌లిసి.. త‌మ స‌మ‌స్య‌ల్ని చెప్పుకునే అవ‌కాశం ఎలా ల‌భిస్తోంద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని చెప్పాలి.

స‌మాజంలోని ప‌లు అంశాల్ని వ్యూహాత్మ‌కంగా ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ల‌టం ప‌వ‌న్ లో క‌నిపిస్తోంది. త‌న‌కున్న నెట్ వ‌ర్క్ తో స‌మాజంలోని వివిధ వ‌ర్గాల వారికి ద‌గ్గ‌రయ్యేలా ప‌వ‌న్ ప్లాన్ చేసుకుంటున్నార‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఇంత‌కాలం ఏపీ ఇష్యూల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించే ప‌వ‌న్‌.. కేంద్రాన్ని విమ‌ర్శించేలా.. త‌ప్పును ఎత్తి చూపించేలా ప‌వ‌న్ వ్యూహం సిద్ధం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ ప్ర‌తినిధులు ప‌వ‌న్ ను క‌లిసిన సంద‌ర్భంగా ఆయ‌న ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాను ప్ర‌స్తావించారు. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని ప‌వ‌న్ తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం. హోదా విష‌యంలో కేంద్రం నాన్చుడు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌టంపై ఏపీ ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ఆగ్ర‌హం.. కోపం ఉంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించాడు ప‌వ‌న్‌. మొత్తానికి డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ప్రైవేటీక‌ర‌ణ పేరుతో మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. చివ‌ర‌కు త‌న మాట‌ల్ని ప్ర‌త్యేక హోదా వ‌ర‌కూ తీసుకొచ్చి ఆప‌టం చూస్తుంటే.. వ్యూహాత్మంగానే ప‌వ‌న్ మాట‌లు ఉన్న‌ట్లుగా చెప్ప‌క‌త‌ప్ప‌దు.