Begin typing your search above and press return to search.

పొత్తు పై పవన్ కల్యాణ్ పెదవి విప్పారు.. ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   12 Jan 2022 10:00 AM IST
పొత్తు పై పవన్ కల్యాణ్ పెదవి విప్పారు.. ఏమన్నారంటే?
X
సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి ఎన్నో పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కానీ.. తాజాగా ఏపీ రాజకీయాల్లో పొత్తుల మీద పద పదే చర్చ జరుగుతోంది. అధికార వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన పార్టీలు జత కట్టాల్సిందేనని.. అప్పుడు మాత్రమే జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వకుండా అడ్డుపడొచ్చన్న వాదన వినిపిస్తోంది.

ఇందులో భాగంగా పొత్తులపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నోటి నుంచి పొత్తు మాట రావటమేకాదు.. జనసేన మీద వన్ సైడ్ ప్రేమే తప్పించి.. వారి నుంచి ఎలాంటి ప్రపోజల్ రావటం లేదని.. అలాంటప్పుడు పెళ్లి సాధ్యం కాదన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పిన బాబుపై సెటైర్లు వేసినోళ్లు వేస్తే.. మరికొందరు పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సు వేళ.. పొత్తులపై ఆయన స్పందించారు. అందరితో కలిసి చర్చించిన తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని కీలక వ్యాఖ్య చేశారు. తాము ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని.. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడటం గమనార్హం.

‘‘రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలి. పొత్తులపై అందరిదీ ఒకే మాటగా ఉండాలి. నేను ఒక్కడినే సింగిల్‌గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదు. పొత్తులనేవి ప్రజాస్వామ్యంగా, ఆమోద యోగ్యంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. పొత్తులపై నిర్ణయం తీసుకునేలోగా ఎవ్వరూ వేరే విధంగా మాట్లాడొద్దని సూచించారు.

వేర్వేరు పార్టీలు ఆడే మైండ్-గేములో పావులు కావొద్దన్న పవన్ కల్యాణ్.. పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కారణంగా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించ లేక పోయామని.. కానీ క్షేత్రస్థాయిలో జనసేన బలం పుంజు కుంటోందన్నారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా జనసేన జెండా రెపరెప లాడుతోందన్నారు

పార్టీ స్థాపించే సమయంలో పార్టీ వెంట ఉన్న యువకులే నేడు నేతలుగా ఎదిగారన్న పవన్.. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే యువతరం మనతోనే ఉందన్నారు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తామని పవన్ చెప్పారు.

పవన్ తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. పొత్తులపై ఏ విషయాన్ని తేల్చకుండా.. ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యానించారని చెప్పాలి. రాజకీయంగా విశేష అనుభవాన్ని ప్రదర్శించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.