Begin typing your search above and press return to search.

పే..ద్ద ప్ర‌హ‌స‌నంగా ప‌వ‌న్ టూర్‌?

By:  Tupaki Desk   |   31 July 2017 11:40 AM IST
పే..ద్ద ప్ర‌హ‌స‌నంగా ప‌వ‌న్ టూర్‌?
X
స‌మ‌స్యకు ప‌రిష్కారం క‌నుగొన‌టం అంటే సూప‌ర్ మార్కెట్ కు వెళ్లి స‌బ్బు కొనుక్కురావ‌టం ఎంత‌మాత్రం కాదు. జ‌నాల‌కు మేలు చేయ‌టమే త‌ప్పించి.. తుచ్చ‌మైన రాజ‌కీయాలు చేయ‌టం త‌న‌కు ఇష్టం లేదంటూ అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీ చేసే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా టూర్ పుణ్య‌మా అని.. ఆయ‌న తీరు ప‌ట్ల విశాఖ వాసుల‌తో పాటు.. ఆయ‌న్ను అమితంగా ప్రేమించి.. అభిమానించే వారికి బాగా అర్థ‌మైంది. త‌మ స‌మ‌స్య మీద ఏదో చేస్తున్నాడ‌ని అనుకున్న కిడ్నీ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న వారికి ప‌వ‌న్ పుణ్య‌మా అని చేదు అనుభ‌వం ఎదురైంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకిలా అంటే.. స‌మ‌స్య ప‌రిష్కారం కంటే కూడా రాజ‌కీయ మైలేజీ మీద‌నే ఎక్కువ ఫోక‌స్ పెట్ట‌టం వ‌ల్ల‌నే అన్న భావ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌కు ఎందుకు వెళ్లారు. ప్ర‌త్యేక ఛార్టెడ్ ఫ్లైట్ లో ఆయ‌న ప్ర‌యాణం ఎందుకు సాగింద‌న్న సూటిప్ర‌శ్న వేస్తే వ‌చ్చే స‌మాధానం.. కిడ్నీ జ‌బ్బుల‌తో తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్న ఉద్దాణం బాధితుల అంశంపై హార్వ‌ర్డ్ వైద్యుల బృందం చేసిన ప‌రిశోధ‌న‌ల మీద త‌న‌కు అవ‌గాహ‌న క‌ల‌గ‌టం కోస‌మ‌ని చెప్పాలి. ఈ స‌ద‌స్సుకు హార్వ‌ర్డ్ వైద్యుల బృందంతో పాటు.. ఏయూ.. గీతం కాలేజీ విద్యార్థులు.. అధ్యాప‌కులు.. కేజీహెచ్‌.. ప్ర‌థ‌మ త‌దిత‌ర ఆసుప‌త్రుల వైద్యులు.. జ‌న‌సేన పార్టీ ముఖ్య‌కార్య‌క‌ర్త‌ల్ని మాత్ర‌మే స‌ద‌స్సు జ‌రిగే ప్రాంగ‌ణంలోకి అనుమ‌తించారు.

మ‌రోవైపు ప‌వ‌న్ కోసం ఉద‌యం 9 గంట‌ల నుంచి ఆయ‌న అభిమానులు.. పాసులు లేని కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున స‌ద‌స్సు జ‌రిగే ప్రాంగ‌ణం బ‌య‌టే ఉండిపోయారు. మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కూ అలానే ఎండ‌లో.. త‌ర్వాత కురిస‌న వాన‌లో త‌డుస్తూ ఉండిపోయారు. ఇన్నేసి గంట‌లు త‌న కోసం ఎదురుచూస్తున్న వారి వంక కూడా ప‌వ‌న్ చూడ‌లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. గంట‌ల కొద్ది స‌మ‌యాన్ని త‌న కోసం వెయిట్ చేసిన వారికి క‌నీసం కొన్ని క్ష‌ణాలైనా కేటాయించి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ కోసం వైద్యుల బృందం చాలాసేపు వెయిట్ చేసింది. అయితే.. ఆయ‌న రాక ఆల‌స్యం అవుతుండ‌టం ప‌ట్ల వైద్యులు కాసింత నిరాశ‌కు.. అసౌక‌ర్యానికి గురైన‌ట్లుగా చెబుతున్నారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వేళ‌కు ప‌వ‌న్ వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చే వేళ‌కే స‌మ‌స్య‌పై తాము చేసిన ప‌రిశోధ‌న‌ల్ని వైద్యులు త‌మ ప్ర‌జంటేష‌న్ ద్వారా దాదాపు పూర్తి చేశారు. అస‌లు వైజాగ్ టూరు ఉద్దేశ‌మే ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య మూలాల మీద దృష్టి సారించేందుకు వైద్యులు చెప్పే మాట‌ల్ని ప‌వ‌న్ ఎందుకు వినాలంటే.. త‌ర్వాతి రోజు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి ఈ విష‌యాల్ని తీసుకువెళ‌తాన‌ని చెప్ప‌టం. అయితే.. అందుకు భిన్నంగా వైద్యుల ప్ర‌జంటేష‌న్ల‌ను ఆల‌స్యంగా వ‌చ్చిన ప‌వ‌న్ విన‌లేదు. కేవ‌లం 8 నిమిషాలు మాత్ర‌మే ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. సెల‌వు తీసుకొని వెళ్లిపోయారు. వ‌చ్చారు.. వెళ్లార‌న్న మాట త‌ప్పించి ఆయ‌న ఎందుకు వ‌చ్చిన‌ట్లు? వ‌చ్చిన దానికి ఏదైనా స‌మాచారాన్ని సేక‌రించారా? వైద్యుల అనుభ‌వాల్ని.. వారు గుర్తించిన అంశాల్ని అడిగి తెలుసుకున్నారా? అంటే అనుమాన‌మేన‌ని చెబుతున్నారు. స‌ద‌స్సు కోసం వ‌చ్చిన‌ట్లు ప‌వ‌న్ క‌నిపించినా.. వ‌చ్చిన అస‌లు ప‌ని వదిలేసిన తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మం కేవ‌లం బాధితుల్ని మాన‌వ‌త్వంతో ఆదుకోవ‌టానికే అన్న‌ట్లు స‌భాముఖంగా చిల‌క‌ప‌లుకులు ప‌లికిన ప‌వ‌న్ తీరుకు భిన్నంగా ఏర్పాట్లు చేయ‌టం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ వ‌చ్చిన ర‌హ‌దారంతా ప‌వ‌న్ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయటం.. ఏదో జ‌రిగిపోతుంద‌న్న హ‌డావుడి క్రియేట్ చేయ‌టం చూస్తే.. టూర్ యావ‌త్తు ప్ర‌చారం కోసం త‌ప్ప మ‌రే ఉద్దేశం లేదన్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఇలాంటివి మొద‌ట్లో బాగానే ఉన్నా.. అదే ప‌నిగా జ‌రిగితే మాత్రం ప్ర‌జ‌లు గుర్తించేస్తార‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తిస్తే మంచిది.