Begin typing your search above and press return to search.

మూడు రాజధానులపై రియాక్షన్.. పవన్ లోపాన్ని ఎత్తి చూపింది!

By:  Tupaki Desk   |   1 Aug 2020 10:40 AM IST
మూడు రాజధానులపై రియాక్షన్.. పవన్ లోపాన్ని ఎత్తి చూపింది!
X
సమస్య ఎదురైనప్పుడు.. దాన్ని ఎదుర్కొనే విషయంలోనే సదరు వ్యక్తి సమర్థత.. సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. రాజకీయాలు ఇందుకు మినహాయింపు కాదు. ప్రతి సంక్షోభంలోనూ కొత్త నాయకత్వం.. కొత్త నాయకుడు పుట్టుకురావటం చూస్తుంటాం. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ఏపీ ప్రజల బతుకుల్ని మార్చాలన్నదే లక్ష్యమైనప్పుడు.. కీలక అంశాల మీద అభిప్రాయాలు సూటిగా స్పష్టంగా ఉండాలి. ఏం జరిగితే ఏం చేయాలన్న దానిపై స్పష్టత చాలా అవసరం.

ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అమలు చేయాలని బలంగా భావిస్తోంది. దీని కోసం బ్యాక్ గ్రౌండ్ లో భారీఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఏపీ అధికార పక్షం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నారు.

అలాంటప్పుడు ఆయన మాటలు ఎంత వాడిగా.. వేడిగా ఉండాలి. అధికారపక్ష ఉలిక్కిపడేలా ఆయన మాటలు ఉండాలి. అందుకు భిన్నంగా థియరీ క్లాస్ మాదిరి ఉంటే ప్రయోజనం ఉండదు. ఒక ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు.. అదెందుకు తప్పు? దాని వల్ల ప్రజలకు కలిగే నష్టాలేమిటి? ప్రజలు ఎలా ఆలోచించాలి? ఏది మంచి ఏది చెడు? అన్న విషయాల్ని వివరించటంతో పాటు.. వారికి దిశానిర్దేశం చేయటంలోనే అధినాయకుడి సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. తాజాగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్న ఏపీ సర్కారు నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించారు.

ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు? ప్రజలు నష్టపోయేదేమిటి? రాష్ట్రానికి ఎదురయ్యే అనర్థాలు ఏమిటి? మొత్తంగా ఏపీ భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రాక్టికల్ ఇబ్బందులు లాంటి వాటిని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ మొండితనంతో రాష్ట్రానికి జరిగే నష్టం ఎంతన్నది గణాంకాలతో.. ప్రజలు ఇట్టే మెచ్చేసే ఉదాహరణలతో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటిదేమీ లేకుండా.. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకోవటంలో అర్థం లేదు.

తాజాగా పవన్ స్పందన చూస్తే.. మూడురాజధానులకు ఇప్పుడు సమయం కాదని.. ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్.. చత్తీస్ గఢ్ రాజధాని రాయగఢ్ లు మూడున్నర వేల ఎకరాల్లో నిర్మించారని.. రాజధాని కోసం 33వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ అన్న మాటల్ని గుర్తు చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరినంతనే వేలాది ఎకరాలుఇచ్చిన రైతులు.. రాజధాని వస్తుందన్న ఆశతో మధ్య.. ఎగువ మధ్యతరగతి వారు పెట్టిన పెట్టుబడుల సంగతేమిటి? ఆరేళ్లుగా ఉన్న రాజధాని మళ్లీ మూడు రాజధానులుగా మారిపోటం వల్ల ఎదురయ్యే కొత్త ఇబ్బందుల్ని చురుకుగా ఉండేలా నిలదీయటం మానేసి.. రియాక్ట్ అయ్యామంటే అయ్యామన్నట్లుగా పవన్ వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఆయనలోని ఉండాల్సిందేమిటన్నది అర్థం కావటమే కాదు.. తన లోపాల్ని ఎప్పటికి ఆయన అధిగమిస్తారన్న భావన కలగటం ఖాయం.