Begin typing your search above and press return to search.

పవన్ కోరిక తీరుతుందా?

By:  Tupaki Desk   |   26 Jun 2023 8:00 PM GMT
పవన్ కోరిక తీరుతుందా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరని కోరికను కోరారు. తీరని కోరికంటే సమీప భవిష్యత్తులో పవన్ కోరిక తీరే అవకాశాలు లేవన్నది వాస్తవం. ఇంతకీ పవన్ కోరిక ఏమిటంటే ప్రజాప్రతినిధుల విషయంలో రీకాల్ సిస్టమ్ ఉండాలట. తమ ఆకాంక్షలమేరకు ప్రజా ప్రతినిధులు పనిచేయడం లేదని జనాలు అనుకుంటే వెంటనే వాళ్ళని పదవుల్లో నుండి దింపేయటం. అంటే అనర్హులను చేస్తు ప్రకటించటమే. ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే కానీ ప్రజాప్రతినిదులు బాధ్యతతో పనిచేయరట.

నిజమే ఈ డిమాండు చాలాకాలంగా మన దగ్గర వినిపిస్తోంది. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉందికూడా. అయితే ఆ దేశాల్లో రాజ్యాంగాన్ని రచించుకునేటప్పుడే ఇలాంటివి ఏర్పాటుచేశారు. కానీ మన రాజ్యాంగంలో ఇలాంటి ఆప్షన్ లేదు. ఇపుడు ఈ పద్దతిని ప్రవేశపెట్టాలంటే పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదం తెలపాల్సుంటంది. పార్లమెంట్లు, అసెంబ్లీలోని ప్రతినిధుల్లో ఎవరు కూడా తమ పదవులు అర్ధాంతరంగా పోతాయంటే ఒప్పుకుంటారు ?

అందుకనే ఏ ప్రభుత్వమైనా రీకాల్ బిల్లు పెడితే కచ్చితంగా అందరు కలిసి ఓడగొడతారు. బిల్లు పాస్ కాకపోతే డిమాండ్ డిమాండుగా మాత్రమే మిగిలిపోతుంది. అందుకనే పంచాయితీ రాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చి ముందు ఈ పద్దతిని స్ధానిక సంస్ధల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడితే బాగుంటుంది.

స్ధానిక సంస్ధలంటే సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లన్న విషయం తెలిసిందే. స్ధానిక సంస్ధల స్ధాయిలో ప్రయోగం ఎలాగుందో గమనించి తర్వాత పై స్ధాయికి తీసుకెళ్ళవచ్చు.

అంతేకానీ మొదలే పార్లమెంటు, అసెంబ్లీల్లో రీకాల్ విధానాన్ని ప్రవేశపెట్టాలంటే ఎవరు అంగీకరించరు, ఎప్పటికీ అమల్లోకి రాదు. పవన్ ఇపుడు చేసిన డిమాండ్ చాలాకాలంగా వివిధ వేదికలపై ఏదో రూపంలో వివిధ రంగాల్లోని కొందరు వినిపిస్తునే ఉన్నారు. జమిలి ఎన్నికల విషయంలోనే పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావటంలేదన్న విషయాన్ని జనాలంతా చూస్తునే ఉన్నారు.

తమ పాలనా కాలాన్నే తగ్గించుకోవటానికి ఇష్టపడని పార్టీలు ఇక తమను అర్ధాంతరంగా పదవిలోనుండి తొలగించే చట్టానికి మద్దతిస్తారా ? ఛాన్సేలేదు. కుర్చీకోసం ఎంతకైనా తెగించే నేతలున్న మనదేశంలో రీకాల్ విధానాన్ని ఆలోచించటం కూడా కష్టమే.