Begin typing your search above and press return to search.

ప్రశ్నిస్తానన్న పవన్ కే ప్రశ్నలు ఎదురయ్యాయ్

By:  Tupaki Desk   |   10 Sep 2016 4:49 AM GMT
ప్రశ్నిస్తానన్న పవన్ కే ప్రశ్నలు ఎదురయ్యాయ్
X
తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తాను నిర్వహించిన కాకినాడ సభలో హోదా అంశంపై కేంద్రాన్ని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిపైనా.. ఏపీ ఎంపీల మీదా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ భవిష్యత్ ప్రత్యేక హోదాతో ముడి పడిందన్న అభిప్రాయాన్ని విస్పష్టంగా వ్యక్తం చేసిన పవన్.. తన సభ ద్వారా కొన్ని ప్రశ్నల్ని తెర మీదకు తీసుకొచ్చారని చెప్పక తప్పదు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పవన్ తన పార్టీ స్థాపన సందర్భంగా స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన సదస్సులో పవన్ ప్రసంగం విన్న పలు ప్రశ్నలు ఆయన్ను వేయాల్సిన పరిస్థితి నెలకొనటం విశేషం.

ప్రత్యేక హోదాపై మూడుదశల్లో తాను పోరాటం చేస్తానంటూ తిరుపతి సభలో స్పష్టం చేసిన ఆయన.. తన తర్వాతి సభ కాకినాడలో ఉంటుందంటూ స్పష్టం చేసి డేట్ కూడా ప్రకటించేశారు. ఈ వైఖరి బాగానే ఉన్నా.. కాకినాడ సభ తర్వాత సంగతేంటి? అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఇక.. కాకినాడ సభతో చేసిన తీర్మానాలేంటి? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం లభించని పరిస్థితి. ఇలాంటివి మరికొన్ని ప్రశ్నలు సంధించే పరిస్థితి.

కొన్ని అంశాల మీద స్పష్టంగా మాట్లాడిన పవన్ మరికొన్ని అంశాల్ని మాట వరసకు కూడా ప్రస్తావించకపోవటం గమనార్హం. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీరును కడిగేసిన పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్రమోడీపై ఒక్కటంటే ఒక్క తీవ్ర వ్యాఖ్య చేయకపోవటంలో అంతర్యం ఏమిటన్నది ఒక ప్రశ్న. వెంకయ్య కావొచ్చు.. అరుణ్ జైట్లీ కావొచ్చు. వీరందరిని నడిపించేది మోడీ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెంకయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తప్పుకాదు కానీ.. ఆయనకు దిశానిర్దేశం చేసే మోడీని ఎందుకు విమర్శించటం లేదన్నది ప్రధాన ప్రశ్న.

ప్రత్యేక హోదా మీద దశల వారీగా ఆందోళన చేస్తానని చెప్పిన పవన్.. కాకినాడ సభ తర్వాతేం చేయాలన్న అంశంపై స్పష్టత లేని పరిస్థితి. ఉద్యమం అన్న తర్వాత ఒక క్రమపద్ధతిలో సాగాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయాన్ని పవన్ పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. కాకినాడ తర్వాత జనసేన కార్యాచరణ ఏమిటన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇవే కావు మరికొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

= హోదా ఇవ్వమని అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించినా.. ఆ విషయాన్నిపవన్ ప్రస్తావించలేదు

= హోదా అన్నది లేదని.. అందుకు బదులు ప్యాకేజీ అన్న జైట్లీ మాటకు ఏపీ సీఎం సానుకూలతను వ్యక్తం చేయటంపై ఎందుకు రియాక్ట్ కాలేదు?

= కేంద్రం ఇచ్చిన రెండు పాచిపోయిన లడ్డూలను తీసుకుంటారా? అని ప్రశ్నిస్తూనే.. విసిరి కొట్టాలన్న పవన్.. హోదా లేదన్నది ఎందుకు ప్రస్తావించలేదు?

= పోరాడితే పోయేదేమీ లేదన్న ఆయన.. హోదా మీద పోరాట పంథాను ఎంచుకోవద్దని చెప్పటం ఏమిటి?

= దక్షిణ.. ఉత్తరాది రాష్ట్రాల్ని ప్రస్తావించటం అంతర్యం ఏమిటి?

= వెంకయ్యను కడిగేస్తున్న పవన్.. మిగిలిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు?

= తిరుపతి.. కాకినాడ సభల్లో బాబు మీద కానీ.. జగన్ మీద కానీ ఎలాంటి విమర్శ చేయకపోవటం ఏంటి?

= పొట్టలో పొడిచిన బీజేపీపై తన పోరుబాట ఏమిటన్న విషయాన్ని ఎందుకు స్పష్టత ఇవ్వలేదు?

= అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను రాజీనామా చేయాలన్న పవన్ మిగిలిన ఎంపీల విషయాన్ని ఎందుకు వదిలేశారు?

= తీవ్రమైన ఆవేశంతో ప్రసంగించిన పవన్.. తన భవిష్యత్ ప్రణాళికను..తర్వాతి కార్యక్రమాన్నిఎందుకు వెల్లడించలేదు?