Begin typing your search above and press return to search.

జనసేన భవిష్యత్ ఎలా ఉంటుంది..?

By:  Tupaki Desk   |   28 Aug 2016 5:30 PM GMT
జనసేన భవిష్యత్ ఎలా ఉంటుంది..?
X
పార్టీ పెట్టిన రెండున్నరేళ్ల తర్వాత ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయటం. అది కూడా రోజు వ్యవధిలో. ఇలాంటి ఆసక్తికర రాజకీయ చర్చకు తెర తీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. తాను వేదికను ఎంచుకోవటానికి తిరుపతినే ఎందుకన్న విషయంలో ఆయన చెప్పిన మాట కన్వీన్స్ అయ్యేలా ఉంది. కానీ.. అంత హటాత్తుగా ప్రత్యేక హోదా మీద ఎందుకు గళం విప్పాల్సిన వచ్చిందన్న సగటు జీవి సందేహానికి పవన్ నుంచి సరైన సమాధానం రాలేదు.

ఎన్నికలు పూర్తి అయి.. మోడీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీ ప్రత్యేక హోదా కోసం తాను రెండున్నరేళ్లు ఆగుతానని ప్రకటించి ఉంటే.. ఈ రోజు ఆయన ఏర్పాటు చేసిన సభ గురించి ఇంత చర్చ జరిగేది కాదు. ఉరుము మెరుపు అన్నది లేకుండా.. ఒక్కసారిగా ప్రత్యేక హోదా మీద సభ ఏర్పాటు చేయటం.. తన గళాన్ని విప్పటం.. రానున్న రోజుల్లో మూడు అంచెల్లో హోదాపై ఉద్యమం చేస్తానని తన షెడ్యూల్ ను టపా టపా చెప్పేశారు.

నిన్న మొన్నటి వరకూ సినిమాల మీద తనకు ఇంట్రస్ట్ లేదన్న పవన్.. తన నిర్ణయాన్ని మార్చుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది. సభలో తొలుత సినిమాల్లో నటించటంపై తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పిన పవన్.. చివర్లో మాత్రం తాను సినిమాలు చేస్తానని.. రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు. గతంలో ఇదే అంశం మీద పవన్ మాటలు వేరేలా ఉండేవి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా తాను మూడు.. నాలుగుసినిమాలు పూర్తి చేసేసి.. ఆ తర్వాత ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చేయనున్నట్లు చెప్పారు.

తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వాదనను పవన్ వినిపించటం కనిపిస్తుంది. తన దగ్గర డబ్బుల్లేవని.. డబ్బుల కోసం సినిమాల్లో యాక్ట్ చేయటం తప్పదని.. అందుకే సినిమాలు తాను కొనసాగిస్తానని చెప్పేశారు. ఇదే విషయంలో గతంలో తెలీదా? అని ప్రశ్నిస్తే పవన్ సమాధానం ఏమిటన్నది తెలీదు. తనకు ప్రధాన ఆదాయవనరైన సినిమాల్ని వద్దనుకొంటానని గతంలో పవన్ ఎలా చెప్పారు? ఇప్పుడా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారన్న ప్రశ్నకు సమాధానం చెబితే పవన్ వైఖరి మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది.

ఎందుకు ఇదంతా అంటే.. పవన్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. పవన్ మాటల్లోనే చెప్పాలంటే.. పవన్ ఒకసాదాసీదా వ్యక్తి అయి.. 72 కిలోల సగటు జీవి అయితే.. అలాంటి వ్యక్తి చెప్పే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ.. పవన్ అంటే ఒక శక్తి. లక్షలాది మందిని తన మాటలతో ప్రభావితం చేసే వ్యక్తి. మరి.. అలాంటి వ్యక్తి నోట ఊరికే అభిప్రాయాలు మారిపోవటం అంత మంచిది కాదు.

పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ తన భవిష్యత్ ప్రణాళికను ఇంత వరకూ వివరంగా చెప్పింది లేదు. గతంతో పోలిస్తే.. తిరుపతి సభలో ఆయన తన ఫ్యూచర్ ప్లాన్ ను కాస్త చెప్పినట్లే అనుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటమే తన లక్ష్యంగా చెప్పుకున్నారు. ఆయన మూడు దశల్లో ‘హోదా’ ఉద్యమాన్ని చేస్తానని చెబుతున్నారు. కానీ.. అందుకు టైమ్ లైన్ ఏమీ ప్రకటించకపోవటం గమనార్హం. తిరుపతి సభలో పవన్ మాటలు చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. నిజానికి ఆయనే ఆ విషయాన్ని తన మాటల్లో అక్కడక్కడా చెప్పేశారు. తనకు పదవులు అక్కర్లేదని.. ఏపీ ప్రజల సుఖ సంతోషాలు మాత్రమే ముఖ్యమని. ఈ రోజు ఉద్యమగోదాలోకి దిగిన పవన్ లక్ష్యం ప్రత్యేక హోదా సాధించటమే. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల్లో దిగుతుందన్న సంకేతాల్ని ఎక్కడా ఇవ్వని పవన్.. తన తాజా లక్ష్యం.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటమేనని చెప్పేశారు. హోదా ఉద్యమంతో పాటు.. సినిమాలు కూడా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన పూర్తిస్థాయిరాజకీయాలకు ఇంకా సిద్ధం కాలేదని చెప్పొచ్చు. సినిమాలుచేస్తూ.. ఎన్నికల బరిలోకి ఆయన దిగుతారా? అన్నది సందేహమే.

ఒకవేళ ప్రత్యేక హోదా సాధనకు ఎన్నికలు ఒక అయుధంగా ఉపయోగపడతుందని భావిస్తే ఎన్నికల గోదాలోకి దిగే వీలుంది. ఒకవేళ అలాంటి అవసరం లేదంటే.. ఎన్నికల వరకూ వెళ్లకపోవచ్చు కూడా. నిన్నటి వరకూ రాజకీయ పార్టీగా చెప్పిన జనసేన.. తాజాగా పవన్ మాటలతో ఆ పార్టీ ఉద్యమ రాజకీయ పార్టీ రూపును సంతరించుకుందని చెప్పాలి. మొదటి నుంచి ఉన్న అలవాటు ప్రకారం వేదిక మీద పవన్ ఒక్కరే కనిపించటం ద్వారా.. తన పార్టీలో తానే అంతా అన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఉద్యమం అన్నాక నలుగురిని కలుపుకోవాలి. అందరిని సమన్వయం చేసుకోవాలి. కలిసి పోరాడితేనే ప్రయోజనం ఉంటుంది. మరా విషయంలో పవన్ ఆలోచనలు ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. ఎప్పుడేం చేస్తారో.. ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో ఒకపట్టాన అర్థం కాని విధంగా వ్యవహరిస్తుంటారు పవన్. ఆయన నేతృత్వంలోని జనసేన ఫ్యూచర్ ఎలా ఉండనుందన్నది చెప్పగలిగేది పవన్ కంటే కూడా కాలమని చెప్పటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.