Begin typing your search above and press return to search.

అయినోళ్ల‌కు కానోళ్ల‌నూ తృప్తి ప‌ర్చ‌ని ప‌వ‌న్‌!

By:  Tupaki Desk   |   10 Dec 2017 11:30 PM GMT
అయినోళ్ల‌కు కానోళ్ల‌నూ తృప్తి ప‌ర్చ‌ని ప‌వ‌న్‌!
X
ప‌వ‌న్ నాలుగు రోజుల ఏపీ ప‌ర్య‌ట‌న మిగిల్చింది. కొద్ది నెల‌లుగా ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్న వ్య‌క్తి.. ఎలాంటి హ‌డావుడి లేకుండా చ‌ల్‌రే.. అంటూ భారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. నాలుగు రోజుల పాటు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఉత్త‌రాంధ్ర మొద‌లుకొని ప్ర‌కాశం జిల్లా వ‌ర‌కూ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.

ఊపిరి స‌ల‌ప‌ని షెడ్యూల్ తో బిజీబిజీగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ లెంగ్తీ స్పీచ్ లు ఇచ్చిన ప‌వ‌న్‌.. ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేకుండా వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై క్తి దూసే వారికి బోలెడంత అవ‌కాశం ఇచ్చిన ఆయ‌న‌.. సంయ‌మ‌నం లోపించిన కార‌ణంగా రెండింటికి చెడ్డ రేవ‌డిలా మారారు.

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు ముందు ప‌వ‌న్‌కు సంబంధించి అనుకూల వ్య‌తిరేక వ‌ర్గాలుగా ఉండేవి. ఏపీ అధికార‌ప‌క్షం నేత‌ల‌తో పోలిస్తే.. విప‌క్ష నేత ప‌వ‌న్ ను పెద్ద‌గా (ఒక‌రిద్ద‌రు నేత‌లు మిన‌హాయిస్తే) విమ‌ర్శించింది కూడా లేదు. ఆ మాట‌కు వ‌స్తే కొన్ని సంద‌ర్భాల్లో ప‌వ‌న్ పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు తెలుగు త‌మ్ముళ్లు.

ఇదిలా ఉంటే తాజా టూర్ లో పోల‌వ‌రం లెక్క‌లు బ‌య‌ట‌పెట్టాలంటూ చెప్ప‌ట‌మే కాదు.. త‌ప్పు లేన‌ప్పుడు లెక్క‌లు చెబితే త‌ప్పేందంటూ వ్యాఖ్యానించ‌టం ద్వారా అధికార తెలుగుదేశం నేత‌ల‌కు అగ్ర‌హం తెప్పించారు. చంద్ర‌బాబు అనుభ‌వం మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్న మాట‌లు చెప్పిన‌ప్ప‌టికీ.. పోల‌వ‌రం విష‌యంలో లెక్క‌లు చెప్పాల‌న్న ప‌వ‌న్ మాట‌లపై టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌హా త‌మ్ముళ్లు ప‌లువురు చిరాకు ప‌డిపోయారు.

ఇక‌.. ఏపీ విప‌క్ష నేత‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ పార్టీ నేత‌లు మొద‌లు సోష‌ల్ మీడియాలోనూ ప‌వ‌న్ పై మాట‌ల దాడి జోరుగా సాగింది. అనుభ‌వంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఎట‌కారంగా మారిపోయాయి. ఇక‌.. కేంద్ర స‌ర్కారు విష‌యంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు బీజేపీ నేత‌ల‌కు మంట‌పుట్టేలా చేశాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప‌వ‌న్‌ కు దైవంతో స‌మాన‌మైన అన్న‌య్య చిరుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు మాట్లాడిన‌ప్ప‌టికీ.. చిరంజీవి అంత‌టి మెత‌క మ‌నిషిని కాద‌న్న మాట‌ల‌పై మెగాస్టార్ అభిమానులు ప‌లువురు హ‌ర్ట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. చిరంజీవిని మోసం చేశారంటూ చెప్పిన ప‌వ‌న్‌.. అదే నోటితో చిరంజీవిని మెత‌క మ‌నిషిగా అభివ‌ర్ణించ‌టం.. మోస‌పుచ్చార‌న్న మాట‌ను చెప్ప‌టంపై చిరు అభిమానులకు ప‌వ‌న్ చేదుమాత్రనే ఇచ్చారు.

ఇక‌.. ప‌రకాల ప్ర‌భాక‌ర్‌.. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ల మీద చేసిన విమ‌ర్శ‌లు పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రంగా మారి.. వాళ్ల మీద ప‌డ‌టం అవ‌స‌ర‌మా అని ప‌లువురు త‌ప్పు ప‌డ‌టం క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే. మీడియాలో త‌న‌కు కాస్తో..కూస్తో అనుకూలంగా ఉంటూ.. త‌న ఎపీ ప‌ర్య‌ట‌న‌ను భారీ ఎత్తున క‌వ‌రేజ్ ఇచ్చిన ఆంధ్ర‌జ్యోతి ఎండీపై ప‌వ‌న్ చేసిన ప‌రుష వ్యాఖ్య‌ల పుణ్య‌మా అని.. రెండో రోజు నుంచి ఏపీలో అర‌పేజీ.. హైద‌రాబాద్ లో పావు పేజీ కంటే త‌క్కువ స్థాయికి కుదించేశారు. ఇలా.. ఒక‌టి కాదు రెండు కాదు.. ప‌లు అంశాల విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా ఉండ‌టం ద్వారా ప‌వ‌న్ అంద‌రిలోనూ అసంతృప్తిని మిగిల్చాడు. అంద‌రివాడిగా ఉండాల‌న్న త‌ప‌నను త‌న మాట‌ల్లో చూపించే విష‌యంలో ప‌వ‌న్‌. త‌ప్ప‌ట‌డుగులు వేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.