Begin typing your search above and press return to search.

పవన్ పాలిటిక్స్: బంద్ విధానం కాదు, కానీ

By:  Tupaki Desk   |   16 April 2018 4:08 PM GMT
పవన్ పాలిటిక్స్: బంద్ విధానం కాదు, కానీ
X
ఏపీ బంద్‌లో విపక్షాలన్నీ పాల్గొని సక్సెస్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మద్దతివ్వడంతో బంద్ విజయవంతమైంది. ఊరూరూ, వాడవాడలా ప్రత్యేక హోదా నినాదాన్ని వైసీపీ వినిపించింది. అయితే.. ఇదే బంద్‌కు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ ప్రత్యేకంగా ఏమీ చేయనప్పటికీ బంద్ విజయవంతం అయిందని, ప్రజాభీష్టం వెల్లడైందంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం.. అదేసమయంలో బందులు తమ విధానం కాదని ఆయన చెప్పడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ కలిసి రాకుంటే బంద్ విజయవంతమయ్యేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం సోమవారం చేపట్టిన ఒక రోజు బందును విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పనిసరి అని, ఇది తాము సాధించుకునే హక్కు అనే ప్రజానీకం అభీష్టాన్ని ఈ బంద్ వెల్లడించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే బంద్ లాంటివి చేయడం తమ పార్టీ విధానం కాదని వెల్లడించారు. అయితే ప్రత్యేక హోదా సాధన మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనదని, అందుకే నిరసన బలంగా తెలపడానికి ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బందు పిలుపుకు మద్దతుగా నిలిచామని చెప్పారు.

మరోవైపు ఈ బంద్‌కు పిలుపునిచ్చిన ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూడా బంద్ అనంతరం మాట్లాడారు. బంద్ విజయవంతమైందంటే హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంతగా ఉందో తేలిపోయిందన్నారు. ప్రత్యేక హోదా కోసం సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ఏపీ సినీ నాటక సంఘ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంభికా కృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీవీ ఆర్టిస్టులు అందరినీ ఒకే రైల్వే బోగీలో తీసుకొని ఢిల్లీకి వెళ్లి అక్కడ ఒకరోజు నిరాహార దీక్ష చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సినిమా ఆర్టిస్టులు కూడా తమ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారని, ఈ నెల 22వ తేదీ లోపు నటీనటులు అందరూ విజయవాడకు వచ్చి పాదయాత్ర చేయడమో లేక ఒకచోట కూర్చొని నిరసన తెలపడమో చేస్తారన్నారు.