Begin typing your search above and press return to search.
హోదాని ఆర్కే బీచ్ లో వదిలేసింది ఎవరు..?
By: Tupaki Desk | 27 Jan 2017 9:40 AM GMTవిశాఖ సాగర తీరం సాక్షిగా ప్రత్యేక హోదా ఆక్రందన వ్యక్తమైంది. అడుగడుగునా అధికార పక్ష అణచివేతల మధ్య కొవ్వొత్తుల ప్రదర్శన ఆశించిన స్థాయిలో జరగకపోవచ్చు. కానీ, హోదా రాలేదన్న అసంతృప్తిని పూర్తిస్థాయిలో అణచివేశామని ఏలికలు భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు! విశాఖలో జరిగిన కార్యక్రమానికి మొదట్నుంచీ పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా ట్వీట్లు చేస్తూ... కొన్ని రీమిక్స్ సాంగ్స్ విడుదల చేసి... హడావుడి చేశారు. కానీ, విశాఖకు రాలేకపోయారు..! అయితే, తీరిగ్గా శుక్రవారం ఉదయాన్నే ఒక ప్రెస్ మీట్... తాను గతంలో చేసిన ట్వీట్లన్నింటినీ ఒకేసారి అప్పజెప్పేశారు. ఉత్తరాది గర్వాన్ని సహించడం అనీ... హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు రాజీపడ్డారనీ... ఇలా తన రొటీన్ మార్కు భావావేశాలతో ప్రెస్ మీట్ ను ముగించేశారు. జైహింద్ అనేసి వెళ్లిపోయారు!
అయితే, ఇక్కడి నుంచే అసలు ప్రశ్నలు మొదలౌతున్నాయి! ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్ కల్యాణ్ ఏదో చేస్తారన్న విశ్వాసం చాలామందిలో ఉండేది. ప్రతిపక్ష నేత జగన్ తరహాలో ఆయన విశాఖకు రాకపోయినా... ఏదో తీవ్రమైన భవిష్యత్ కార్యాచరణే ప్రకటిస్తారని అతడి అభిమానులూ ఆశించారు! కాకపోతే... అలాంటి అంశాల జోలికే పవన్ పోలేదు. గతంలో ఆయన చెప్పిన మాటల్నే మళ్లీమళ్లీ చెప్పారు. పవన్ నుంచి జనసేన అభిమానులు ఆశించిందిగానీ, సగటు ఆంధ్రుడు కోరుకున్నదిగానీ ఏదీ వినిపించలేదు. ప్రత్యేక హోదాపై జనసేన కార్యాచరణ ఏంటో కూడా చెప్పలేదు!
జల్లికట్టు స్థాయిలో మనం ఉద్యమించలేమా అని చెప్పందీ ఆయనే! ఇప్పుడు, జల్లికట్టుకు మించిన కలిసికట్టుతో ఆంధ్రా యువత కదం తొక్కితే... ఆ స్ఫూర్తిని విశాఖ బీచ్ లో వదిలేస్తున్నదీ ఆయనే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పవన్ కల్యాణ్ ఉద్యమించడం అంటే... ఆవేశపూరితంగా నాలుగు ట్వీట్లు పెట్టేసి చేతులు దులిపేసుకోవడమా అనే విమర్శలూ మొదలయ్యాయి. ఇంకోపక్క... ప్రత్యేక హోదా గురించి మేము కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదని తెలుగుదేశం స్పష్టం చేస్తూనే ఉంది. అక్కడితో ఆగితే బాగుండేది... ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా అర్థం చేసుకోవాలని సాఫ్ట్ గా ఆ పార్టీ చెబుతోంది. పవన్ ప్రెస్ మీట్ అయిన వెంటనే టీడీపీ నాయకుడు బోండా చెప్పిందీ ఇదే. పవన్ కు తమ పార్టీ చాలా ప్రాధాన్యత ఇస్తోందని అంశాల వారీగా చెప్పుకొచ్చారు. పవన్ తో దోస్తీ కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు.
ఇంతకీ... పవన్ కల్యాణ్ ప్రారంభించిన ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పుడు ఎక్కడున్నట్టు..? ఆర్కే బీచ్ లో ఆయన వదిలేశారా..? ఆయనే రగలించిన పోరాట స్ఫూర్తికి కొనసాగింపు చూపలేకపోతున్నారా..? పవన్ మాటల్లోని ఆవేశం ఆచరణలో కనిపించదా..? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/