Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ కు ఎస్ అంటోన్న ప‌వ‌న్?

By:  Tupaki Desk   |   1 Nov 2018 12:54 PM GMT
టీఆర్ ఎస్ కు ఎస్ అంటోన్న ప‌వ‌న్?
X
ప్ర‌జా సేవ చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాజ‌కీయ నాయకుడికి మినిమ‌మ్ విజ‌న్ ఉండాలి. అందులోనూ ఓ పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటూ...రెండు రాష్ట్రాల‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌నుకుంటోన్న వ్య‌క్తికి ఆ విజ‌న్ ...కొంచెం ఎక్కువే ఉండాలి. కానీ, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మాత్రం బొత్తిగా ఆ విజ‌న్ లేన‌ట్లు క‌నిపిస్తోంది. పూట‌కో మాట మారుస్తోన్న ప‌వ‌న్...త‌న చంచ‌ల గుణంతో విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. మొన్న‌టివ‌ర‌కు త‌న‌కు సీఎం ప‌దవిపై ఆశ‌లేద‌ని చెప్పిన ప‌వ‌న్...స‌డెన్ గా త‌న‌ను సీఎం చేయండంటూ ప్ర‌జ‌ల‌కు విన్న‌పాలు చేస్తున్నారు. ఇక‌, మొన్న‌టివ‌ర‌కు తెలంగాణ‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాన‌న్న ప‌వ‌న్....తాజాగా యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణలో పోటీ చేయ‌డం మాట ప‌క్క‌న‌బెడితే...త‌మ‌ ఆత్మ ప్ర‌బోధానుసారం ఓటు వేయాలంటూ జ‌న సైనికులకు హిత‌బోధ చేశార‌ట జ‌న‌సేనాని.

ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారాతో తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవాల‌ని టీఆర్ ఎస్...గులాబీ కోట‌ను బ‌ద్ద‌లుకొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాకూట‌మి అస్త్రశ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, ఏపీలో మూడో ప్ర‌ధాన పార్టీగా బ‌రిలోకి దిగుతున్న జ‌న‌సేన....తెలంగాణలో మాత్రం సైలెంట్ అయింది. వాస్త‌వానికి తెలంగాణ సాధార‌ణ ఎన్నిక‌ల్లో 119 స్థానాల్లో పోటీచేయాల‌ని జ‌న‌సేనాని భావించారు. అయితే, ముంద‌స్తు న‌గారా ముందుగానే మోగ‌డంతో ప‌రిస్థితులు మారిపోయాయి. దీంతో, జ‌న‌సేనాని వెనుక‌డుగు వేశారు. ఆ త‌ర్వాత 25 అసెంబ్లీ...2ఎంపీ స్థానాల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌బోతున్నార‌ని టాక్ వ‌చ్చింది. అయితే, జ‌న‌సేన ఇప్పుడిప్పుడే ఏపీలో బ‌లం పుంజుకుంటోంద‌ని - ఈ స‌మ‌యంలో తెలంగాణ‌లో పోటీ చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ప‌వ‌న్ భావించార‌ట‌. అయితే, మ‌హాకూటమి మ‌ద్ద‌తు అడిగినా...ప‌వ‌న్ నో అన్నారట‌. దీంతో, టీఆర్ ఎస్ కు మ‌ద్ద‌తుగా జ‌న‌సేన క్యాడ‌ర్ ను దించాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్నార‌ని టాక్ వ‌స్తోంది. ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌న్న సామెత‌ను ప‌వ‌న్ వంట బ‌ట్టించుకున్నట్టున్నార‌ని టాక్. అందుకే, తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలోనుంచి ప‌వ‌న్ త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాన‌లో పోటీకి జ‌న‌సేన దూరంగా ఉండ‌డంతో జ‌న‌సైనికులు నిరాశ‌లో ఉన్నారట‌.