Begin typing your search above and press return to search.

జ‌న‌సేనానికి పాలిటిక్స్ క‌లిసి రావ‌ట్లేదా..ఏం జ‌రుగుతోంది..?

By:  Tupaki Desk   |   16 Dec 2019 1:30 AM GMT
జ‌న‌సేనానికి పాలిటిక్స్ క‌లిసి రావ‌ట్లేదా..ఏం జ‌రుగుతోంది..?
X
మార్పు కోసం పెట్టిన జ‌న‌సేన‌లో ఇప్పుడు ఎలాంటి మార్పు క‌నిపిస్తోంది? స‌మాజంలో మార్పు మాటేమో కానీ.. ఇప్పుడు పార్టీలోనే పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయా ? వీటిని త‌ట్టుకోవ‌డం ఇప్పుడు జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్ల కావ‌డం లేదా ? అనే సందేహాలు - ప్ర‌శ్న‌లు తెర‌ మీదికి వ‌స్తున్నాయి. ఏ పార్టీలో అయినా అధినేత అడుగు జాడ‌ల్లో న‌డిచే నాయ‌కులు అవ‌స‌రం. పార్టీ సిద్ధాంతాల‌ను లేదా లైన్‌ ను ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తీసుకువెళ్లే నాయ‌కులు - ద్వితీయ శ్రేణి నేత‌లు - కార్య‌క‌ర్త‌లు చాలా అవ‌స‌రం. అదే స‌మ‌యంలో పార్టీ వాయిస్ వినిపించే అధికార ప్ర‌తినిధులు కూడా ఎంతో అవస‌రం.

ఇక‌, వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు చేయ‌కుండా .. ముక్కు మీద గుద్దిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తాం.. అంటే.. పార్టీల‌కు మ నుగ‌డ క‌ష్ట‌మే అనేది అంద‌రికీ తెలిసిన నిజం. కానీ, మార్పు కోసం ఆవిర్భ‌వించి దాదాపు పాతికేళ్ల ప్ర‌స్థానా న్ని లిఖించుకున్న జ‌న‌సేన‌లో అధినేత దూకుడుకు త‌గిన విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ వినిపించే నాయ‌కులు ఏ ఒక్క‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం - జ‌న‌సేనానికి క‌లిసి వ‌చ్చేసైన్యం లేక పోవ‌డం ఇప్పుడు చిత్రంగా ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు ఒకింత ఫ‌ర్వాలేదు అనుకున్న పార్టీలో ఇప్పుడు ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. కేవ‌లం ప‌వ‌న్ మాత్ర‌మే తెర‌మీద క‌నిపిస్తున్నారు. ఆయ‌న వాయిస్ మాత్ర‌మే వినిపిస్తోంది.

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో దాదాపు 148 చోట్ల జ‌న‌సేన త‌ర‌ఫున నాయ‌కులు పోటీ చేశారు. మ‌రి వీరిలో గెలిచింది ఒక్క‌రే అయినా.. మిగిలిన వారంతా ఏమ‌య్యారు? పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు వీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ముఖ్యంగా విశాఖ ఎంపీగా పోటీ చేసిన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కావొచ్చు - తెనాలి నుంచి పోటీ చేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్ కావొచ్చు.. ఇలా కీల‌క‌మైన నాయ‌కులు ఇప్పుడు వాయిస్ వినిపించ‌డంలోను - జ‌న‌సేనాని వెంట త‌మ స‌త్తా చాట‌డంలోనూ ఎందుకు మౌనం వ‌హిస్తున్నారు? అనేది కీల‌క ప్ర‌శ్న. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయిన నాయ‌కులు కూడా తర్వాత కాలంలో ఆ పార్టీని ముందుండి న‌డిపించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నేది వాస్త‌వం. మొత్తంగా చూస్తే.. జ‌న‌సేన సైన్యం లేని పార్టీ గా మిగిలిపోతోంద‌ని అంటున్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం ఉంద‌ని అంటున్నారు.