Begin typing your search above and press return to search.

తెలంగాణ బ‌రిలో జ‌న‌సేన ఉందా ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   8 Oct 2018 7:33 AM GMT
తెలంగాణ బ‌రిలో జ‌న‌సేన ఉందా ప‌వ‌న్‌?
X
ఒక రాజ‌కీయ‌పార్టీ ఎలా ఉండ‌కూడ‌ద‌న్న మాట‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తుంటుంది జ‌న‌సేన‌. పేరుకు రాజ‌కీయ పార్టీగా చెప్పుకున్నా.. రాజ‌కీయ పార్టీల‌కు ఉండాల్సిన ప్రాధ‌మిక ల‌క్ష‌ణాలేవీ ఆ పార్టీ లో కనిపించ‌దు. చెప్పే మాట‌ల‌కు చేసే మాట‌ల‌కు ఏ మాత్రం పొంత‌న లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ క‌ల్యాణ్ పుణ్య‌మా అని ఇప్పుడు తెలంగాణ‌లో జ‌న‌సేన బ‌రిలోకి దిగ‌నుందా? లేదా? అన్న‌ది పెద్ద క్వ‌శ్చ‌న్ గా మారింది.

ఈ మ‌ధ్య‌న మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. మొత్తం 119స్థానాల్లో జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. త‌క్కువ‌లో త‌క్కువ పాతిక వ‌ర‌కూ స్థానాల్లో పోటీకి దిగే అవ‌కాశం ఉందంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ క‌నీసం నిర్మాణం కూడా లేని నేప‌థ్యంలో పాతిక స్థానాల్లో నిల‌వ‌టం ద్వారా సాధించేదేమిటి? అన్న క్వ‌శ్చ‌న్ వేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ‌లో పార్టీ నిర్మాణ‌మే లేద‌ని.. పార్టీకి స‌రైన నేత లేర‌ని.. ఇలాంటివేళ‌.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నామ‌ని ప్ర‌క‌టించ‌టంతో లాభం కంటే కూడా న‌ష్ట‌మే జ‌రుగుతుందంటున్నారు.

వ‌చ్చే ఏడాదిలో ఏపీలో జ‌రిగే అసెంబ్లీ.. పార్ల‌మెంటు ఎన్నిక‌లు ప‌వ‌న్ కు చాలా కీల‌కంగా మార‌నున్నాయి. ఏపీలో భారీ ఎత్తున సీట్లు గెలిచే అవ‌కాశం లేకున్నా.. అధికార‌ప‌క్షంగా ఎవ‌రుఉండాల‌న్న విష‌యాన్ని నిర్ణ‌యించే కీల‌క భూమిక తాము పోషిస్తామ‌న్న న‌మ్మ‌కం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లో వినిపిస్తోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో తెలంగాణ‌లో పార్టీ పోటీ చేయ‌టం ద్వారా త‌న ఇమేజ్ ను తానే దెబ్బ తీసుకున్న‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు.

తెలంగాణ మీద మొద‌ట్నించి ప‌వ‌న్ ఫోక‌స్ త‌క్కువ‌గా ఉంద‌న్న మాట వినిపిస్తోంది ఇలాంటివేళ‌లో త‌న‌కు కీల‌క‌మైన ఏపీని వ‌దిలేసి.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌టం ద్వారా.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌టం ద్వారా త‌న స‌త్తాను తానే చెడ‌గొట్టుకున్న‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. పోటీ చేసే స్థానాల‌కు గెలిచే స్థానాల‌కు సంబంధం లేకుంటే.. పార్టీని పోటీలో ఉంచి త‌ప్పు చేసిన‌ట్లు అవుతుందంటున్నారు. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన నాయ‌క‌త్వం లేక కిందా మీదా ప‌డుతున్న వేళ‌.. ఇప్పుడు అక్క‌డ బ‌లమైన నాయ‌క‌త్వాన్ని ఏర్పాటు చేయాల్సింది పోయి.. అది వ‌దిలేసి ఆద‌రాబాదరాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాలు పంచుకోవ‌టం ద్వారా అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాసే అవుతుంద‌ని చెబుతున్నారు. పార్టీ ప‌రంగా ఇప్ప‌టికి స‌రైన యంత్రాంగం హైద‌రాబాద్‌ తో స‌హా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న‌ది లేదు. అలాంట‌ప్పుడు తెలంగాణ ఎన్నిక‌ల్లో పాల్గొని ప‌రువు పోగొట్టుకునే క‌న్నా.. కాస్త దూరంగా ఉంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.