Begin typing your search above and press return to search.
పవన్ మాట!...నా బలమెంతో నాకే తెలియదు!
By: Tupaki Desk | 2 Sept 2017 10:57 AM ISTటాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్... రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివేట్ కావడానికి ఇంకో నెల మాత్రమే సమయముంది. అక్టోబర్ లో పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తానని ఆయన చేసిన ప్రకటన మనకు తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నెలలో పవనఖ పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారుతారన్న మాట. అయినా పార్టీ స్థాపించి ఇప్పటికే మూడేళ్లు దాటి పోతుంటే... ఇంకా అప్పుడొస్తా - ఇప్పుడొస్తా అంటూ పవన్ నుంచి వస్తున్న ప్రకటనలు ఆయన అభిమానులను ఒకింత అసహనానికి గురి చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఎప్పుడెప్పుడు పోటీలోకి దిగుదామా? అంటూ పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ వేచి చూసే ధోరణితో వారంతా అసంతృప్తికి గురవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న మీడియాకు పంపిన సందేశంలో పవన్ కల్యాణ్ మరోమారు తన అభిమానులను నిరాశకు గురి చేశారనే చెప్పాలి. జనసేన డిజిటల్ కార్యకర్తలతో భేటీకి సంబంధించిన వీడియోను శుక్రవారం ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ పార్టీ ప్రస్తుత పరిస్థితి - భవిష్యత్ కార్యాచరణ - ప్రస్తుతం తన బలం - పార్టీ బలం తదితర విషయాలపై కాస్తంత క్లారిటీగానే మాట్లాడినట్లుగా చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని అసెంబ్లీ - పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందన్న దానిపై ఇప్పుడే తానేమీ చెప్పలేనని.. 2018 ఆఖరు నాటికే దీనిపై ఒక స్పష్టత వస్తుందని పవన్ చెప్పారు. ప్రస్తుతం తన రాజకీయ బలమెంతో తనకే తెలియదని, అక్టోబర్ నుంచి ప్రజలోకి వెళ్లిన తర్వాత క్రమంగా స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రాంతాలవారీగా ప్రత్యేకించి తనకు ఎటువంటి ప్రాధాన్యతా ఉండదని, తెలంగాణ అంటే తనకు ఎక్కువ అభిమానమని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలతో కలసి పనిచేసే అంశంపై అన్ని అవకాశాలకు జనసేన పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయని పవన్ చెప్పారు.
