Begin typing your search above and press return to search.

యాత్రల్లో భారీ బ్రేకులు..వేడిపుట్టిదెలా పవన్?

By:  Tupaki Desk   |   30 Dec 2018 6:26 AM GMT
యాత్రల్లో భారీ బ్రేకులు..వేడిపుట్టిదెలా పవన్?
X
ప్రజా నాయకులెప్పుడు ప్రజల్లోనే ఉంటారు.. ప్రజాసమస్యలపైనే పోరాడుతుంటారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్లు ఇంకా ఎక్కువ సమయం ప్రజల మధ్యలో ఉండాలి. అప్పుడే వారు అధికారంలోకి రాగలుగుతారు. నాడు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ను ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. నేడు ఆయన కుమారుడు జగన్ కూడా మూడేళ్లుగా ప్రజాసంకల్పయాత్ర పేరిట ప్రజల్లోనే ఉంటున్నారు. పుట్టిన రోజును కూడా ప్రజల సమక్షంలోనే చేసుకుంటున్నారు..

కానీ మన మోడ్రన్ నేత జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ రూటే వేరు. ఆయన అనూహ్యంగా యాత్రలు చేపడుతారు.. అధికార, ప్రతిపక్షాలను సినిమాటిక్ డైలాగులతో వీరలెవల్లో తిడతారు.. యువతకు ఊపునిస్తారు...ఆ వేడి పీక్ స్టేజికి చేరిన వేళ.. చటుక్కున మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయి కనపడకుండా కొద్దిరోజులుంటారు. ఎన్నిరోజులు యాత్ర చేస్తే అన్నే రోజులు రెస్ట్ తీసుకోవడం పవన్ హాబీగా పెట్టుకున్నారు..

మొన్నటికి మొన్న కోస్తాతీరంలో శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ - తర్పు గోదావరిల్లో యాత్ర పేరిట మొదలుపెట్టిన పవన్ విరామం లేకుండా ప్రజల్లో గడిపారు. ఉత్తరాంధ్రతో పర్యటనలు ప్రారంభించి రాయలసీమలో కొంతవరకు కొనసాగించారు. జనసేన పార్టీ హీట్ పతాకస్థాయికి చేరిన అనంతరం సడన్ గా మాయమయ్యారు. పార్టీ నిర్మాణం పేరిట అమెరికా యాత్ర చేయడం.. ఆ తర్వాత క్రిస్మస్ - న్యూ ఇయర్ వేడుకలకు విహారయాత్రలకు స్విట్జర్ లాండ్ వెళ్లిపోయారు.

తాజాగా కొత్త సంవత్సరం వేళ.. మళ్లీ పవన్ కళ్యాణ్ కు ఖాళీ సమయం దొరికింది. అందుకే పాత యాత్రలను పక్కనపెట్టి మళ్లీ ఫ్రెష్ గా యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. జనవరి 1 నుంచి మళ్లీ పవన్ యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. పాత పోరాట యాత్రలు మధ్యలోనే ఉన్నా.. మళ్లీ కొత్త యాత్రలకు పవన్ శ్రీకారం చుట్టడం జనసేన నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పవన్ వీరావేశంతో యాత్రలు చేయడం.. తర్వాత అంతేకాలం సుధీర్ఘంగా విశ్రాంతి తీసుకోవడం చేస్తున్నారు. ఇలాగే యాత్రలు చేస్తూ వస్తున్నారు. ప్రజాజీవితంలో కలకాలం ఉండాలుకుంటున్న నేతలు ఈ రకమైన పద్ధతులు అనుసరించకూడదో అలానే పవన్ వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

పవన్ తీసుకునే హాలీడేల మధ్యలో యాత్రలు చేస్తున్నట్టు ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఆయన యాత్రలు కూడా అలాగే సాగుతుండడంతో జనాలు కూడా పెద్దగా పవన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ కళ్యాన్ రాష్ట్రమంతా ప్రజాసమస్యల కోసం పర్యటించే ఉద్దేశం మంచిదే అయినా.. ఇలా గ్యాప్ లు ఎక్కువ ఇస్తూ ఆ సీరియస్ నెస్ ను నీరుగారుస్తున్నారన్న అపప్రద జనసేన నాయకులు - కార్యకర్తలు - సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి ఈ విరామ యాత్రలతో ఎలా సాధిస్తారన్నది వారి ప్రశ్న.. మరి పవన్ ఇప్పటికైనా ఈ యాక్టివ్ పాలిటిక్స్ లో పాలుపంచుకుంటాడా లేదా అన్నది వేచిచూడాలి.