Begin typing your search above and press return to search.

‘తర్వాత చెప్తా’ : డైలాగో ఎవరిదో చెప్పగలరా?

By:  Tupaki Desk   |   16 March 2018 11:30 PM GMT
‘తర్వాత చెప్తా’ : డైలాగో ఎవరిదో చెప్పగలరా?
X
ప్రస్తుత రాజకీయాల్లో ఈ డైలాగు తరచుగా వాడేదెవరో చెప్పగలరా? ఎలాంటి ప్రశ్న అడిగినా సరే.. తర్వాత చెప్తా.. మళ్లీ మాట్లాడతా.. సమయం వచ్చినప్పుడు చెప్తా.. అనే డైలాగు వేయగలిగిన సమర్థుడు పవన్ కల్యాణ్ ఒక్కరే. తాను చెప్పదలచుకున్న విషయాలను ఆయన చాలా ఘాటుగా - సూటిగా చెప్తారు. కానీ.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రం.. తర్వాత చెప్తా - ఇంకా ప్రకటించే సమయం రాలేదు.. సమయం వచ్చినప్పుడు చెప్తా.. లాంటి దాటవేత సమాధానాలు ఇస్తారు.

దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతోంది?

పవన్ కల్యాణ్.. సాధారణంగా ప్రెస్ మీట్ నుంచి బహిరంగ సభ వరకు చాలా పక్కాగా ప్రిపేర్ అవుతారు. ఫుల్ స్క్రిప్ట్ రాసుకుని.. అక్షరదోషాలతో సహా సరిచేసుకుని... ప్రిపేర్ అవుతారు. ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే.. స్క్రిప్టు ఎవరు రాసినా సరే.. అందులో తనకు వచ్చే ప్రతి సందేహాన్ని.. వాళ్లతోనే నివృత్తి చేసుకుని.. దానికి సంబంధించి మూలాలనుంచి పూర్తి వివరాలు తెలుసుకుని అవగాహన పెంచుకుంటారు. ఆ రకంగా ఒకసారి స్క్రిప్టు ప్రిపేర్ అయిన తర్వాత.. సహజంగా మాట్లాడే.. మహాద్భుత వక్తలాగా ఆయన రక్తి కట్టించేలా మాట్లాడగలరు. ఆ విద్య ఆయనకు అలవడింది.

కానీ సమస్య ఎక్కడ వస్తున్నదంటే.. స్క్రిప్టు తయారుకాని అంశాలు... ఇప్పటి దాకా పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోని విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆయన పూర్తగా తడబడిపోతారు. కాకపోతే ఎన్నో ఢక్కా మొక్కీలు తిన్న నటుడు గనుక.. తన కంగారు బయటపడనివ్వకుండా.. చాలా జాగ్రత్తగా దాన్ని దాటవేస్తారు. తర్వాత.. మళ్లీ.. సమయం రాగానే అంటూ నెట్టేస్తారు.

తాజాగా ఓ టీవీ ఛానెల్ యాప్ ను విజయవాడలో ప్రారంభించిన తర్వాత కూడా అదే జరిగింది. తెదేపా అవినీతి పై ప్రజల్లో ఉన్న మాటలే చెప్పానన్న పవన్ - కేవలం డబ్బుతో ఎన్నికల్లో గెలవలేం అంటూ.. తాను ఎన్ని స్థానాల్లో పోటీచేసేది మాత్రం తర్వాత చెప్తా అన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపులపై అడిగితే కూడా.. తర్వాత మాట్లాడుతా.. అంటూ పవన్ కల్యాణ్ దాటవేయడం విశేషం.